• తాజా వార్తలు

జియో ఫోన్ 2లో గేమ్స్ డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

రిల‌య‌న్స్ జియో తాను ప్ర‌వేశ‌పెట్టిన చౌక ఫోన్‌ను ‘‘భారతదేశపు స్మార్ట్‌ఫోన్‌’’గా ఊద‌ర‌గొడుతున్న మాట నిజ‌మే అయినా, అది దేశీయ‌ (ఆ మాట‌కొస్తే విదేశీ) మార్కెట్‌లో బాగా హిట్ అయింద‌న‌డం నిస్సందేహంగా వాస్త‌వం. ఆ మ‌ధ్య ఎక‌న‌మిక్ టైమ్స్ ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం... 2018 ఏప్రిల్ 25నాటికి 4 కోట్ల జియో ఫోన్లు అమ్ముడయ్యాయ‌ట‌! 
మ‌రి.. ఇంత భారీ సంఖ్య‌లో ఫోన్లు అమ్ముడయ్యాయంటే వాటిలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ గేమ్స్ కూడా ఉండి ఉంటాయ‌ని భావించ‌డంలో త‌ప్పేముంటుంది? అలా జియో ఫోన్ విజ‌య‌వంతం కావ‌డంతో జియో ఫోన్ 2ను ఆ కంపెనీ ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వంనాడు మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. కానీ, జియో ఫోన్ 2లో గేమ్స్ ఆడుకునే అవ‌కాశం ఉన్నా 
గూగుల్ ప్లే స్టోర్‌లోగ‌ల అన్ని గేమ్స్‌నూ జియో ఫోన్ సపోర్ట్ చేయ‌క‌పోవ‌డం ఒక ప్ర‌తికూలాంశం. అందుకే జియో ఫోన్ 2లో గూగుల్ ప్లే స్టోర్‌ను ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోవాలి. ముందుగా వినియోగ‌దారుల ఆద‌ర‌ణ పొందిన కొన్ని గేమ్స్ గురించి తెలుసుకుందాం... ‘‘2048, స్టీల్ స్టోరీ, మాయా బ్రిక్ బ్రేక‌ర్‌, SWOOOP, చాకొలేట్ జ్యువెల్స్‌, ఫిక్స్‌-ఇట్ ఫెలిక్స్ ఇట్‌’’ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో పిల్ల‌లు, బాల‌బాలిక‌ల‌కు అనువైన‌వి ‘‘స్టీల్ స్టోరీ/PAC Man/క్రేజీ బ‌ర్డ్స్‌, క్యాండీ బ్రేక‌ర్‌, చాకొలేట్ జ్యువెల్స్‌, టాప్ షూట‌వుట్‌, ఏజ్ ఆఫ్ బార్బేరియ‌న్స్‌’’ వ‌గైరా ఉన్నాయి. ఇక ఏయే గేమ్స్ ఉన్నాయో చెప్పి ఊరించ‌డం మాని, అస‌లు సంగ‌తికి వ‌చ్చేద్దాం...
జియో ఫోన్‌లో ప్లే స్టోర్‌ను ఎలా వాడాలి?
ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంద‌ని అప్పుడే క‌ళ్లు తెరిచిన ప‌సికందు కూడా చెప్ప‌గ‌ల రోజులివి! కానీ, జియో ఫోన్‌లోగానీ, జియో ఫోన్ 2లోగానీ ప్లే స్టోర్ లేదు. కార‌ణం... ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో కాకుండా KaiOSతో ప‌నిచేయ‌డ‌మే. అయితే, ఇది యాపిల్ iOSకు భిన్న‌మైన‌ది. అంతేకాకుండా మ‌న దేశంలో ఆండ్రాయిడ్ త‌ర్వాత iOSక‌న్నా ఎక్కువ‌గా వాడుతున్న ఆపరేటింగ్ సిస్ట‌మ్ KaiOS కావ‌డం విశేషం. మ‌రి, జియో ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఎలా వాడుకోవాలో తెలుసుకుందామా?
STEP 1: జియో ఫోన్‌లో డిఫాల్ట్ బ్రౌజ‌ర్ ఉందిక‌దా... దాన్ని ఓపెన్ చేయండి.
STEP 2: దాని అడ్ర‌స్ బార్‌లో www.google.com అని టైప్ చేయండి.
STEP 3: గూగుల్ సెర్చింజ‌న్ పేజీ ఓపెన్ అయ్యాక అందులో Google Play Store అని టైప్‌చేసి సెర్చ్ చేయండి.. లేదా  https://play.google.com/store?hl=en అని టైప్ చేయండి.
STEP 4: మీరు నేరుగా ప్లే స్టోర్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. ఇలా చేసేట్ల‌యితే మీకు STEP 1, 2ల‌తో ప‌ని లేదు. వెబ్‌సైట్ తెరుచుకున్న త‌ర్వాత మీకు కావాల్సిన గేమ్స్ వెతుక్కోవ‌డ‌మే త‌రువాయి. అటుపైన ఆయా గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలాగో కూడా తెలుసుకుందాం... ముందుగా- మొబైల్ లేదా జియో ఫోన్‌లో గేమ్స్ ఆడుకోవడానికి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ విధానాలున్నాయ‌ని మీరు గుర్తుంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ఆడుకోవాలంటే మీకు హైస్పీడ్ ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ ఉండాలి. లేక‌పోతే మీరు ఆడే గేమ్ మ‌ధ్య‌మ‌ధ్య‌లో హ్యాంగ్ అవుతూంటుంది. దీనికి బ‌దులు డౌన్‌లోడ్ చేసుకుంటే మీరెప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ లేకుండా ఆడుకోవ‌చ్చు. అయితే, ట‌చ్‌స్క్రీన్‌తో ఆడ‌గల గేమ్స్ అన్నీ కీపాడ్‌తోనూ ఆడుకోగ‌ల‌వి కాక‌పోవ‌చ్చున‌ని గ‌మ‌నించండి. ఇలా రెండు విధాలుగానూ ఆడుకోగ‌ల గేమ్స్‌ను మాత్ర‌మే జియో ఫోన్ల‌లో ఆడుకునే వీలుంటుంది.
 మీరు పైన చెప్పిన ప‌ద్ధ‌తిలో గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేశారు కాబ‌ట్టి...
 స్క్రీన్ పై భాగాన సెర్చ్‌బార్‌ను గ‌మ‌నించండి...
 మీరు ఆడుకోవాల‌నుకునే గేమ్ పేరును సెర్చ్‌బార్‌లో టైప్ చేయండి. సాధార‌ణంగా ఈ గేమ్స్ MMO (Massively Multiplayer Online), Simulations, Adventure, Real Time Strategy (RTS), Puzzle, Action, Stealth Shooter, Combat, First Person Shooter (FPS), Sports, Role-Playing (RPG), Educational వ‌గైరా విభాగాలుగా ఉంటాయి.
 ఆ విభాగాల్లోనుంచి మీకు కావాల్సిన గేమ్‌ను ఎంచుకున్న త‌ర్వాత ‘డౌన్‌లోడ్‌’ లేదా ‘ఇన్‌స్టాల్‌’ బ‌ట‌న్ క‌నిపించ‌లేదంటే జియో ఫోన్ ఆ గేమ్‌ను స‌పోర్ట్ చేయ‌ద‌ని అర్థం చేసుకోవాలి.
 క‌నుక డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ ఆప్ష‌న్ బ‌ట‌న్లు క‌నిపించేవి మాత్ర‌మే మీకు అందుబాటులో ఉన్న‌ట్లు లెక్క‌. వాటి సైజును బ‌ట్టి మీ ఫోన్‌లో నిరంత‌రాయంగా ఆడుకునే వీలుండ‌వ‌చ్చు లేదా మీ ఫోన్ త‌ర‌చూ క్రాష్ అవుతుంది.
 డౌన్‌లోడ్ చేసుకున్న‌ గేమ్స్‌ను మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఇన్‌స్టాల్ చేసుకోన‌క్క‌ర్లేదు. అవే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతాయి.
     రిల‌య‌న్స్ జియో త‌మ ఫోన్ల‌ను గేమ్స్ ఆడేవారిని దృష్టిలో ఉంచుకుని త‌యారు చేయ‌క‌పోయినా నిత్యం ఆఫీసు ప‌నితో త‌ల‌మున‌క‌ల‌య్యే ఈ రోజుల్లో మొబైల్ గేమ్స్ చాలా ఊర‌ట‌నిస్తాయ‌న్న వాస్త‌వాన్ని జియో మ‌ర‌చిపోలేద‌నే చెప్పాలి.

జన రంజకమైన వార్తలు