వాట్సప్.. ఇప్పుడు ఉపయోగించని వారు, తెలియని వారు ఉండరేమో. స్మార్ట్‌ఫోన్ ఉందంటే వాట్సప్ తప్పనిసరి. అన్ని ఉపయోగాలు ఉండబట్టే యూత్ దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడూ వాట్సప్‌లో చాట్ చేస్తూనే ఉంటారు చాలామంది. అయితే వాట్సప్‌లో ఉన్న ఫీచర్ల గురించి అందరికి పూర్తిగా తెలియదు. సాధారణంగా ఒకసారి ఒకరికే మనం మెసేజ్ పంపగలం. గ్రూప్ చాట్‌లో మాత్రమే అందరికి ఒకేసారి మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ చాట్‌లో కాకుండా ఒకేసారి అందరికి మెసేజ్‌లు పంపడం ఎలాగో చూద్దామా..
బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ద్వారా..
బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ ద్వారా ఒకేసారి ఎక్కువ కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపే అవకాశం ఉంటుంది. అయితే దీని వాడకం ఐఫోన్‌కు, ఆండ్రాయిడ్ ఫోన్‌కు భిన్నంగా ఉంటుంది. ఐఫోన్లో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లను సృష్టించాలంటే చాట్ స్క్రీన్‌లో టాప్‌కు వెళ్లాలి. అందులో బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే న్యూ లిస్ట్ అనే బటన్ వస్తుంది. మీరు ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి లిస్ట్‌ను ప్రిపేర్ చేయాలి. మీరు మాగ్జిమమ్ 256 మందినే సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇలా సెలక్ట్ చేసిన తర్వాత క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. అంతే మీ బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ సిద్ధం అవుతుంది. ఒకేసారి మీరు వీళ్లందరికి మెసేజ్ పంపేయచ్చు.
ఆండ్రాయిడ్‌లో అయితే..
ఆండ్రాయిడ్‌లో అయితే చాట్‌లో మీరు మెనూ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ కొత్త బ్రాడ్‌కాస్ట్ పేజీలో.. మీకు కావాల్సిన వారి పేర్లను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చెక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. అంతే మీకు కొత్త బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ మీ చాట్ స్క్రీన్ పైభాగంలో యాడ్ అవుతుంది. మీరు అందరికి ఒకే మెసేజ్ పంపాలనుకుంటే ఆ లిస్ట్‌లో ఉన్న వారందరిని సెలక్ట్ చేసి మెసేజ్ పంపేయచ్చు.