సామాజిక మాధ్యమం వాట్సాప్ ఒక చాట్ యాప్‌గానే మనందరికీ తెలుసు. కానీ, ఈ యాప్‌తో ఇంకా అనేకం చేయవచ్చు. ఉదాహరణకు మన కాంటాక్ట్స్‌లోని ఒక సమూహానికి ‘బ్రాడ్‌కాస్ట్’ ద్వారా ఏదైనా నోటిఫికేషన్ పంపవచ్చు... రియల్‌టైమ్ లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు... డబ్బులు పంపించవచ్చు.. వీటికితోడు వాట్సాప్ ఇటీవలే కంపెనీలు, మార్కెట్ నిపుణులు, ఇతరత్రా సేవల కోసం ప్రత్యేకంగా ‘వాట్సాప్ బిజినెస్ యాప్’ను ప్రారంభించింది. ఇక వాట్సాప్‌తోనే కాకుండా ఇతర మెసేజింగ్ యాప్‌లద్వారా ఎవరికైనా ఆహ్వానాలు కూడా పంపించే వెసులుబాటు ఉంది. అలాగని... మీరేమీ విసుగెత్తించే సుదీర్ఘ టెక్స్ట్ మెసేజ్ పంపే అవసరం లేదు. మీకే సొంతమైన డిజిటల్ ఆహ్వాన పత్రికను పంపే వీలుంది. వీటితో వ్యయభారం తగ్గడమేగాక ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ డిజిటల్ కార్డులు సృష్టించుకోవడం ఎలాగో చూద్దామా:
WHATSAPP STATUSను వాడుకోండి
వాట్సాప్‌లో మీరు సహజ ఆహ్వాన పత్రికలను తయారు చేసుకోవడం వీలుకాదుగానీ, మీలోని సృజనాత్మకతకు పదును పెడితే వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌తోనే అందమైన ఆహ్వానాలను సృష్టించేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్ స్టేటస్ స్క్రీన్‌ను ఓపెన్ చేయండి. అందులోని టెక్స్ట్, డూడుల్, స్టిక్కర్ వగైరా ఫీచర్లను ఇన్విటేషన్ తయారీకి వాడుకోండి. అటుపైన దాన్ని మీ స్టేటస్ కింద అప్‌లోడ్ చేయకుండా స్క్రీన్‌షాట్ తీసుకుని, క్రాప్ చేసి పంపదలచుకున్నవారికి వాట్సాప్‌ద్వారానే పంపండి. ఈ సహజ ఆప్షన్లు మీకు నచ్చకపోతే మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి.
INVITATION CARD MAKER APPS వాడండి
ఫోన్‌తో కాల్స్ మాత్రమే చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏ పని కావాలన్నా... వర్డ్ డాక్యుమెంట్ సృష్టి, ఫొటోల ఎడిటింగ్, ఫొటో పెయింటింగ్‌లాంటి సృజనాత్మక పనులను ఫోన్‌తో చేసేసుకోవచ్చు. ఆ కోవలోనే ఇన్విటేషన్ కార్డులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం iOS, Android యాప్ స్టోర్లలో ఇన్విటేషన్ కార్డ్ మేకర్ యాప్‌లు బోలెడున్నాయి. మీరు చేయాల్సిందల్లా సందర్భానికి తగిన మాటలు కూర్చడమే. ఆ పని పూర్తయ్యాక థీమ్‌ను మార్చి, ఇతర అంశాలను సరిచేసుకోవచ్చు. దాంతో సదరు యాప్‌లు ఇన్విటేషన్ ఇమేజ్‌ని సృష్టిస్తాయి. అలా సృష్టించుకున్న ఇమేజ్‌ని వాట్సాప్‌ద్వారా పంపించవచ్చు. ఇలాంటి యాప్‌లలో ‘కణ్వ’ (CANVA) ఒకటి. ఇది Android, iOS రెండు ప్లాట్‌ఫామ్‌లపైనా లభ్యం కావడంతోపాటు దీనికి వెబ్ వెర్షన్ కూడా ఉంది. ఈ యాప్‌లో సులభ వినియోగ ఇంటర్ఫేస్‌తోపాటు డిజైన్ టెంప్లేట్‌లు చాలా ఉంటాయి. పుట్టినరోజు, పెళ్లి, ‘ సేవ్ ది డేట్’ వగైరా సందర్భాలకు తగినట్లు వీటిని వాడుకోవచ్చు. సామాజిక మాధ్యమ గ్రాఫిక్స్‌ను తయారుచేసుకోవడానికి ఈ యాప్ పెట్టింది పేరు.
కంప్యూటర్‌పై వీడియో సృష్టి
మీకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ గురించి తెలిసి ఉంటే మీ సృజనాత్మకత ఆధారంగా వీడియో ఇన్విటేషన్ కార్డ్ కూడా తయారు చేసుకోవచ్చు. అటుపైన దాన్ని మీ ఫోన్‌కు పంపి, వాట్సాప్‌ద్వారా ఆ వీడియోను షేర్ చేసుకోవచ్చు. అయితే, వాట్సాప్‌లో వీడియోగా షేర్ చేస్తే దాని నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి డాక్యుమెంట్ రూపంలో పంపవచ్చు.
ఫోన్‌తో వీడియో రూపకల్పన
మీకు వీడియో సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం లేకున్నా, కంప్యూటర్ లేకపోయినా చింత లేదు. మీ ఫోన్‌తోనే మీరు వీడియో క్రియేట్ చేయొచ్చు. ఫొటోల స్లైడ్‌షో లేదా మీ SD కార్డ్‌లోని ఫొటోలతో వీడియో రూపొందించవచ్చు. స్లైడ్‌షోతో వీడియో చేయాలంటే సందర్భానికి తగిన మంచి ఫొటోలుండాలి. ఇక SD కార్డ్‌లోని ఫొటోలతో చేయాలనుకుంటే అందులోని ఫొటోలను తీసుకోవాలి. అలా ఫొటోలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీ ఫోన్‌లోని వీడియో ఎడిటింగ్ యాప్‌తో పైన చెప్పిన రెండు పద్ధతుల్లోనూ స్లైడ్ షో క్రియేట్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్, స్టిక్కర్స్ యాడ్ చేసి, నేపథ్య సంగీతాన్ని, ఇతర అంశాలను మార్చవచ్చు. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే Quik, VideoShow లేదా Viva Video వంటి యాప్‌లతో ప్రయత్నించండి.
ఆహ్వానాలను PDFగానూ పంపండి
దక్షిణ భారతంలో పెళ్లి పత్రికలు సాధారణంగా రెండు పేజీలుంటాయి. ఆ పెళ్లి పత్రికను ఫొటోతీసి వాట్సాప్‌లో పంపేయొచ్చు. అయితే, వాటిని PDF ఫైల్‌లో చూడగలిగితే మరింత వాస్తవిక భావన కలుగుతుంది. ఇందుకోసం మీ దగ్గరున్న ఫొటోలను Image to PDF కన్వర్టర్ సాయంతో డౌన్‌లోడ్ చేసి, కావాల్సినవి ఎంపిక చేసుకోండి. పెళ్లి పత్రికలోని పేజీలకు అనుగుణంగా వాటిని క్రమపద్ధతిలో అమర్చుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫొటోలను పీడీఎఫ్‌లోకి మార్చడం కోసం DLM Infosoftను వాడుకోవచ్చు.
WEB APPతో కార్డుల సృష్టి
చివరగా చెబుతున్నప్పటికీ వెబ్ యాప్‌తోనూ ఇన్విటేషన్ కార్డులు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలంటే మీకు Youvivid.net వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. సందర్భం ఏదైనా దీని సాయంతో మీరు అత్యాధునిక రీతిలో కార్డులు సృష్టించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక థీమ్‌ను ఎంపిక చేసుకుని, అందులో మీ వేడుక వివరాలను నింపడమే. మ్యాప్, గ్యాలరీ, రిమైండర్ వంటి ఆప్షన్లతో ఒకటికన్నా ఎక్కువ పేజీలను తయారుచేసుకునే వీలుండటం దీని ప్రత్యేకత.