• తాజా వార్తలు

ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

ఆధార్ కార్డ్‌.. ప్ర‌తి ఒక్క‌రికి అవ‌సర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌చారం కూడా చేస్తోంది. ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ఉండాల‌ని.. లేక‌పోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. అంతేకాదు ఆధార్ కార్డుని బ్యాంకు అకౌంట్‌కి, ఎల్‌పీజీ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకోవాల‌ని కూడా చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్‌కి వెళ్లి ఆధార్ కార్డు ఇస్తే స‌రిపోతోంది. మ‌రి ఎల్‌పీజీ అకౌంట్‌తో ఆధార్ కార్డుని లింక్ చేసుకోవ‌డం ఎలా.. సాధార‌ణంగా అయితే మ‌న ఎల్‌పీజీ కనెక్ష‌న్ ఉన్న సెంట‌ర్‌కు వెళ్లి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐతే టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత అన్ని చోట్ల‌కు తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లోనే మీ ఆధార్‌ను గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకునే వీలుంది. అదెలాగో చూద్దాం.

ఆధార్ సీడింగ్ పేజీ ద్వారా..
ఆన్‌లైన్ ద్వారా మీ గ్యాస్ క‌నెక్ష‌న్‌తో ఆధార్‌ను లింక్ చేయాల‌ని అనుకుంటే చాలా సుల‌భం ముందుగా మీ అఫీషియ‌ల్ ఆధార్ సీడింగ్ పేజీని ఓపెన్ చేయాలి.

1. అఫీషియ‌ల్ ఆధార్ సీడింగ్ పేజీని ఓపెన్ చేసిన త‌ర్వాత స్టార్ట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. ఆ ట్యాబ్ ఓపెన్ కాగానే ఎల్‌పీజీ గ్యాస్‌తో ఆధార్‌ను క‌నెక్ట్ చేసేందుకు ఒక ఆన్‌లైన్ అప్లికేష‌న్ మీకు క‌నిపిస్తుంది.

2. ఈ ఆన్‌లైన్ అప్లికేష‌న్లో మూడు స్టెప్స్ ఉంటాయి. మొద‌టిది ముందుగా మీరు ఏ ఏరియాలో ఉంటారో స్ప‌ష్టంగా పేర్కొనాలి. మీ అడ్రెస్ వివ‌రాలు పూర్తిగా రాయాలి.

3. స్టెప్ వ‌న్‌లో ఒక మెనూ మీకు క‌నిపిస్తుంది. అడ్రెస్‌, స్టేట్‌, జిల్లా త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి. మీ ఆధార్ కార్డులో ఏ వివ‌రాలు ఇచ్చారో అదే వివ‌రాలు ఇక్క‌డ కూడా ఇవ్వాలి. లేక‌పోతే ఎర్ర‌ర్ వ‌స్తుంది.

4. రెండో స్టెప్‌లో బెనిఫిట్ టైప్‌ను ఎంపిక చేసుకోవాలి. అంటే ఎల్‌పీజీలో మీరు ఏ స్కీమ్ పేరుతో క‌నెక్ష‌న్ తీసుకున్నారో వివ‌రాలు ఇవ్వాలి. మీరు భార‌త్ గ్యాస్‌ను వాడుతుంటే బీఓపీఎల్ భార‌త్ గ్యాస్ ఆధార్ లింక్ మీద క్లిక్ చేయాలి. మీరు ఇండేన్ వాడుతుంటే ఐఓసీఎల్ ఇండేన్ గ్యాస్ లింక్ మీద క్లిక్ చేయాలి. హెచ్‌పీ గ్యాస్ వాడుతుంటే హెచ్‌పీసీఎల్ లింక్ మీద క్లిక్ చేయాలి.

5. మీ సంబంధిత గ్యాస్ కంపెనీ లింక్ మీద క్లిక్ చేశాక‌.. మీ డిస్ట్రిబ్యూట‌ర్ పేరు, మీ కంజ్యుమ‌ర్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. మీ కంజ్యుమ‌ర్ నంబ‌ర్ మీకు తెలియ‌క‌పోతే.. మీ గ్యాస్ బుక్‌లో చూడొచ్చు.

6. కంజ్యుమ‌ర్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసిన త‌ర్వాత మీ పూర్తి వివ‌రాలు మ‌రోసారి ఎంట‌ర్ చేయాలి. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబ‌ర్‌, ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.

7. ఈ డిటైల్స్ అన్ని ఫిల్ చేశాక ఓకే బ‌ట‌న్ నొక్కితే.. వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌స్తుంది. ఆ ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్‌ బ‌ట‌న్ నొక్కాలి. అంతే మీ ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్ష‌న్‌తో లింక్ చేసుకున్న‌ట్లే.

ఎస్ఎంఎస్ ద్వారా..
ఎస్ఎంఎస్ ద్వారా మీ ఆధార్ కార్డుని గ్యాస్ క‌నెక్షన్‌తో లింక్ చేసుకోవాలంటే ఈ దిగువ విధానాలు పాటించాలి. యూఐడీ సీడ్ (పెద్ద అక్ష‌రాలు) టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు నివ‌సించే రాష్ట్రం పేరు (షార్ట్‌గా) టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ గ్యాస్ కనెక్ష‌న్ స్కీమ్ (షార్ట్‌) టైప్ చేసి స్పేస్ ఇచ్చి స్కీమ్ ప్రొగ్రామ్ ఐడీ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబ‌ర్‌ను టైప్ చేసి 51969 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి.

జన రంజకమైన వార్తలు