ఇప్పుడు ఎక్కడ చూసినా క్రికెట్ జ్వరమే.. ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కావడంతో అభిమానులు మ్యాచ్‌లు చూడటానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆఫీసుల్లో ఉన్నా కూడా స్కోర్లు తెలుసుకోవడం కోసం చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. మే 30న ప్రారంభమైన ఈ మెగా టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తున్నారు. అయితే టీవీలు అందుబాటులో లేని వాళ్లు ఏం చేయాలి? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇంకా టీవీలను నమ్ముకుంటే ఎలా? ఆన్‌లైన్ ఉండగా ఎందుకు చింత? మరి ప్రపంచకప్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చూడడం?
హాట్‌స్టార్
టెక్నాలజీ గురించి తెలిసిననాళ్లకు హాట్‌స్టార్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. లైవ్ అప్‌డేట్స్, మ్యాచ్‌లు, టీవీ షోలు ఇలా అన్ని రకాల వినోదం హాట్‌స్టార్‌లో దొరుకుతుంది. స్టార్‌స్పోర్ట్స్‌కు చెందిన ఈ ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రపంచకప్‌ను కూడా మనం లైవ్‌గా చూడొచ్చు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్‌లలో ఈ హాట్‌స్టార్ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. హాట్‌స్టార్ వెబ్‌సైట్లో మాత్రమే కాక.. యాప్‌లో కూడా మనం లైవ్ చూడొచ్చు. అంటే ప్రయాణం చేస్తూనో లేదా ఏదైనా పని చేస్తూనో ఫోన్ లైవ్ పెట్టుకుంటే చాలు మనకు ఎప్పటికప్పుడు క్రికెట్ సమాచారం తెలిసిపోతుంది. అయితే ఇందుకు మీరు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా చూసే వీలు ఉన్నా అది కొన్ని రోజులు మాత్రమే. వీఐపీ ప్లాన్ (రూ365) తీసుకుంటే చాలు ఏడాది పాటు మనం హాట్‌స్టార్‌లో ప్రసారాలు వీక్షించే అవకాశం ఉంది.
జియో, ఎయిర్ టెల్ టీవీల ద్వారా..
హాట్‌స్టార్ ద్వారా మాత్రమే కాక ఇతర ఫ్లాట్‌ఫాం ద్వారా మనం ప్రపంచకప్‌ను చూసే అవకాశం ఉంది. జియో టీవీ, ఎయిర్ టెల్ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించే అవకాశం ఉంది. జియో, ఎయిర్‌టెల్ సబ్‌స్కైబర్లు అయితే చాలు ఉచితంగా ప్రపంచకప్ ప్రసారాలను వీక్షించే అవకాశం ఉంది. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్లో కాక ఫోన్లో కూడా ఈ ప్రసారాలు తిలకించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఉచితంగా ప్రసారాలు వీక్షించడం దీనిలో ప్రత్యేకత. ప్రపంచకప్ ప్రసారాలను వీక్షించడానికి స్కై స్పోర్ట్స్ ఛానెల్ కూడా ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే వీఐపీ వీక్షణ కోసం మాత్రం 25 పౌండ్లు వసూలు చేస్తుంది ఈ సంస్థ.