• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /

ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) అన‌గానే ఎందుకో తెలియని కంగారు వ‌స్తుంది. ఎందుకంటే మ‌నం ఏదో ఒక ఇబ్బందిలో చిక్కుకుని ఉంటాం. దానికి తోడు పోలీసుల‌తో ప‌ని. చాలామందికి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాలంటేనే జంకు. వారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించడం కూడా పెద్ద ప‌నే. అయితే పెద్ద పెద్ద కేసుల్లో పోలీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. కానీ మొబైల్స్ పోయినా, లేదా ఏదైనా విలువైన డాక్యుమెంట్లు పోయినా ఎఫ్ఐఆర్ తీసుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఎందుకంటే ఈ కేసుల‌ను వాళ్లు చాలా చిన్న‌గా చూడ‌డ‌మే దీనికి కార‌ణం. కానీ ఎఫ్ఐఆర్ లేనిదో బీమా కంపెనీల‌తో ప‌ని కాదు.
మ‌నం పోగొట్టుకున్న వ‌స్తువుల‌కు ప్ర‌తిఫ‌లం పొందాలంటే క‌చ్చితంగా పోలీసుల ద‌గ్గ‌ర నుంచి తీసుకున్న ఎఫ్ఐఆర్ కాపీ కావాల్సిందే. అయితే పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌కుండానే మ‌నం ఎఫ్ఐఆర్‌కు అప్లై చేయ‌గ‌లిగితే! అంత‌కంటే ఆనందం ఇంకేం ఉంటుంది అంటారా? అయితే అలా చేయ‌డానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీ మొబైల్ పోగొట్ట‌కుంటే పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు క‌నీసం ఎలాంటి ర‌సీదు కూడా ఇవ్వ‌రు. ఇంకా ఎఫ్ఐఆర్ సంగ‌తి స‌రేస‌రి. కానీ మీరు పోగొట్టుకున్న డాక్యుమెంట్లు, మొబైల్స్‌కు ఆన్‌లైన్‌లో ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో చూద్దామా?

1. ఉదాహ‌ర‌ణ‌కు మీరు హైద‌రాబాద్‌లో మొబైల్ లేదా విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకుంటే.. హైద‌రాబాద్ సిటీ పోలీస్ సైట్‌కు వెళ్లాలి. అందులో మీ ఫిర్యాదును స్వీక‌రించే ఒక అప్లికేష‌న్ క‌నిపిస్తుంది. ఆ అప్లికేష‌న్లో అన్ని వివ‌రాలు పూర్తి చేయాలి
2. మీ పేరు, పూర్తి వివ‌రాలు, మీ త‌ల్లిదండ్రుల పేర్లు, మీ పూర్తి చిరునామా ఎంట‌ర్ చేయాలి.
3. ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న మొబైల్ నంబ‌ర్ ఇవ్వాలి. ఈ మెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వాలి. స్థ‌లం వివ‌రాలు కూడా తెలియ‌జేయాలి. ఆ వ‌స్తువు ఎప్పుడు పోయింది. ఎక్క‌డ పోయింది. ఏ తేదీని పోయింది అన్ని వివ‌రాలు అందించాలి.
4. మీరు పోగొట్టుకున్న వ‌స్తువు వివ‌రాలు ఏమైనా ఉంటే వాటిని రాయాలి. అంటే కొన్ని గుర్తులు ఇవ్వాలి. క‌ల‌ర్ చెప్పాలి. ఒక‌వేళ డాక్యుమెంట్లు పోగొట్టుకుంటే వాటి వివ‌రాలు తెలియ‌జేయాలి. ఆ త‌ర్వాత సెక్యూరిటీ కోడ్‌ను ఎంట‌ర్ చేయాలి. ఈ వివ‌రాల‌తో పోలీసులు ఎఫ్ఐఆర్ త‌యారు చేసే అవ‌కాశం ఉంటుంది. ఏమైనా అనుమానాలు ఉన్నా వారు ఫోన్‌లోనే మిమ్మ‌ల్ని అడిగే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు