మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో నెట్ స్పీడ్ అకారణంగా తగ్గిపోయిందా? అయితే మీ వైఫైను పక్కింటివాళ్లెవరో వాడేస్తున్నారని అర్ధం. ఎందుకంటే మీరు వైఫైకి కనెక్ట్ చేసిన ల్యాప్‌టాప్, ఇంట్లోవాళ్ల స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నప్పుడు స్పీడ్‌గానే వచ్చిన నెట్.. ఒక్కసారే తగ్గిపోయిందంటే మీతోపాటు వేరేవాళ్లెవరో ఆ వైఫైని వాడుకుంటున్నట్లు అన్నమాట. ఇది మీకు డేటా లాస్ మాత్రమే కాదు సెక్యూరిటీపరంగా కూడా సురక్షితం కాదు. అందుకే మీ వైఫైని ఎవరన్నా మీకు తెలియకుండా వాడేస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం తప్పనిసరి. అందుకు ఏం చేయాలో చూద్దాం
రూటర్ చెప్పేస్తుంది..
మీ ఇంట్లో వైఫైతో కనెక్ట్ అయి ఉన్న డివైస్‌లన్నింటిలో వైఫై ఒక్కసారి టర్న్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ వైఫై రూటర్‌ను చూడండి. ఇప్పటికీ మీ రూటర్లో లైట్ బ్లింక్ అవుతుంటే మీ వైఫైని మీకు తెలియకుండా వేరేవాళ్లు వాడేస్తున్నట్లే. అయితే ఇది మీ డివైస్‌లన్నీ వైఫై డిజేబుల్ చేసినప్పుడు మాత్రమే నమ్మదగింది. అంతగా మీకు డౌట్ తీరాలంటే మరిన్ని లోతయిన పద్ధతులు కూడా ఉన్నాయి.
1. యాప్ వాడడడం
మీ వైఫై నెట్‌వర్క్‌ను వేరేవాళ్లవరు మీకు తెలియకుండా వాడుతున్నారో లేదో తెలుసుకోవడానికి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
వైఫై ఇన్‌స్పెక్టర్ (Wi-Fi Inspector)
ఇది క్రోమ్ బ్రౌజర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీ నెట్‌వర్క్ మీద పని చేస్తున్న అన్ని డివైస్‌లు, వాటిపేర్లు, ఐపీ అడ్రస్‌లతో సహా అన్ని వివరాలిస్తుంది. దీంతో ఇతరులెవరైనా వైఫై వాడితే వెంటనే తెలిసిపోతుంది.
పాయ్‌స్లర్ పీఆర్టీజీ రూటర్ మానిటరింగ్ (Paessler PRTG Router Monitoring)
దీనిలో ఫుల్ రూటర్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఉన్నాయి. కొత్తగా ఎవరయినా మీ వైఫైని యాక్సెస్ చేస్తే చెప్పే ఆటోమేటిక్ డిటెక్షన్ టూల్ కూడా ఉంటుంది. ఇంట్లో వైఫై వాడేవాళ్లకు ఇది కొద్దిగా ఎక్కువే. చిన్నచిన్న వ్యాపారులు వైఫైతో కనెక్ట్ అయిన బిజినెస్‌లు చేసేవారికి ఇది బాగా పనికొస్తుంది. ఈ రూటర్ మానిటరింగ్ సర్వీస్‌కు 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. ఈ ఫ్రీ ట్రయల్‌తోనే మీ సమస్య చాలా వరకు తీరిపోతుంది.
ఎఫ్ సెక్యూర్ రూటర్ చెకర్ (F-Secure Router Checker)
ఇది కూడా వెబ్ బేస్డ్ టూల్. ఎవరైనా మీ సైన్ ఇన్, పాస్‌వర్డ్‌తో వైఫైని కొట్టేస్తుంటే వెంటనే పట్టిచ్చేస్తుంది. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పట్టుకోగలదు.
వైర్‌లెస్ నెట్‌వర్క్ వాచర్ (Wireless Network Watcher)
విండోస్, మాక్ ఓఎస్ యూజర్ల కోసం బాగా ఉపయోగపడే ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ ఇది. వైఫై ఇన్‌స్పెక్టర్‌లాగే ఇది కూడా మీ వైఫైతో కనెక్ట్ అయి ఉన్న డివైస్‌ల లిస్ట్ అంతా చూపించేస్తుంది.
ఫింగ్ (Fing)
ఫింగ్ అనేది మొబైల్ ఓరియంటెడ్ సర్వీస్. ఐవోఎస్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మీ వైఫైతో కనెక్ట్ ఉన్న డివైస్‌లు, అవి ఎలాంటివి? వాటి కనెక్షన్ ఎలాంటిది? మ్యా క్ అడ్రస్ వంటి వివరాలన్నీ చూపిస్తుంది. బిజీ సమయాల్లో మీ వైఫై కనెక్షన్ బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా చెక్ చేసుకోవచ్చు.
2. అడ్మినిస్ట్రేటర్ లాగ్స్‌ను చెక్ చేయండి.
ఎవరైనా మీ వైఫైని దొంగిలిస్తున్నారని అనుమానం వస్తే మీ రూటర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పేజీకి లాగిన్ అవ్వాలి. అడ్రస్ బార్‌లో "192.168.1.1" లేదా "192.168.2.1" టైప్ చేస్తే ఈ పేజీలోకి వెళ్తారు. అడ్మిన్ పేజీలోకి వెళ్లాక మీరు మీ కంప్యూటర్‌కు కనెక్ట్ అయి ఉన్న మీడియా యాక్సెస్ కంట్రోల్ (MAC) అడ్రస్‌ల లిస్ట్‌ను చూడగలుగుతారు. కొన్ని రూటర్స్‌లో ఇది కనిపించకపోవచ్చు. అప్పుడు మీరు wireless configuration, wireless status, లేదా DHCP clientలో మీ వైఫైని వాడుకుంటున్న మాక్‌ల జాబితా చూడొచ్చు. మీ డివైస్‌లు కాకుండా వేరే మ్యాక్ ఐపీలు కూడా కనిపిస్తుంటే మీ వైఫైని ఎవరో వాడేస్తున్నట్లే.