రైల్వే టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు ఉపయోగించే ఐఆర్ సీటీసీలో టిక్కెట్ల కొనుగోలు ఇకపై మరింత సులభం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ లో సెకను ఆలస్యమైనా బెర్తు దొరకని పరిస్థితి. దీంతో ఏజెంట్లకే ఎక్కువ టిక్కెట్లు దొరకడం.. సాధారణ వినియోగదారులకు దొరక్కపోవడం జరుగుతుంటుంది. కానీ.. ఇక నుంచి ఆలాంటి ఇబ్బందులు తొలగించడానికి రైల్వేశాఖ సిద్ధమైంది.
ఎంవీసాతో భరోసా
టికెట్ల కోసం వెబ్ సైట్ ను ఓపెన్ చేసినప్పుడు కనిపించే బెర్తులు, ఆపై చెల్లింపు సమయానికి వెయిటింగ్ లిస్టులోకి రావడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తక్షణ ప్రయాణానికి తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారిని ఈ సమస్య వేధిస్తోంది. ఇలా చెల్లింపులకు మరింత సమయం పట్టకుండా చూసేందుకు ఐఆర్సీటీసీ ఎం-వీసా పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
కస్టమర్లు, తమ తమ వీసా డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ప్రీపెయిడ్ అకౌంటును ఎం-వీసా యాప్ కు అనుసంధానం చేసుకుంటే టిక్కెట్ బుకింగ్ క్షణాల్లో పూర్తి చేయొచ్చు.
ఇలా కార్డులను అనుసంధానం చేసుకున్న తరువాత టికెట్ బుక్ చేసుకునేటపుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే, మరుక్షణమే చెల్లింపు పూర్తవుతుంది.
క్యాష్ బ్యాక్ కూడా...
ఇక ఎం-వీసాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ ఆఫర్ గా సెప్టెంబర్ 4 వరకూ బుక్ చేసుకునే టికెట్లపై రూ. 50 క్యాష్ బ్యాక్ ను అందించనున్నారు.