స్మార్టు ఫోన్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లొస్తున్నాయి. ఉన్న ఫీచర్లు అప్ డేట్ అవుతున్నాయి. అయినా, కొత్త మోడల్ ఫోన్ వచ్చిందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకతే ఉండే ఉంటుంది. ఇటీవల కొద్దికాలంగా స్మార్టు ఫోన్లలో రెండు కెమేరాలు ఉంటున్నాయి.. ఫ్రంట్, రియర్ కెమేరా రెండు ఉంటున్నాయి కదా అనుకోవద్దు. రియర్ కెమేరాలే రెండు ఉంటున్నాయి. చాలా మోడళ్లలో ఇప్పుడిలా రెండు రియర్ కెమేరాలు ఉంటున్నాయి. ఒకే చోటు రెండు కెమేరాలు(డ్యూయల్ కెమేరా) ఉండడం వల్ల లాభమేంటి.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. ఒకే ఒక్క కెమేరాను హై ఫిక్సెల్ కెపాసిటీతో పెట్టొచ్చు కదా అనేవారూ ఉంటారు. కానీ.. రెండు కెమేరాలు వాడడానికి కూడా కారణాలు ఉన్నాయి.
డ్యూయల్ కెమేరా వల్ల రెండు లెన్సులు పక్కపక్కనే కానీ ఒకదాని కింద మరొకటి కానీ అమర్చుతారు. సాధారణంగా సింగిల్ కెమెరా అయితే అందులోనే లెన్సు, సెన్సార్లు మొదలైనవన్నీ ఫిట్ చేయాలి. పైగా ఫోన్ స్లిమ్ గా ఉండాలి.. అలాంటప్పుడు అన్నీ అక్కడికక్కడే అమర్చి, తక్కువ సామర్థ్యం ఉన్నవి వాడడం వల్ల ఫొటోల నాణ్యత తగ్గుతుంది. కానీ, డ్యూయల్ కెమేరాల్లో ఆ అవసరం ఉండదు. దీనివల్ల రెండు స్వతంత్ర కెమేరా మాడ్యూల్స్ అమర్చుకోవచ్చు. అందులో ఒకటి ప్రైమరీ లెన్సుగా పనిచేసి ఎదురుగా ఉన్న సీనులో ప్రధాన ఆబ్జెక్టులను తీసుకుంటుంది. అదే సమయంలో రెండోది మరింత కాంతిని గ్రహించడంతో పాటు క్షేత్రపరిధిని విస్తరిస్తుంది. దీనివల్ల ఫొటో క్లియర్ గా వస్తుంది.
నిజానికి స్మార్టు ఫోన్లలో డ్యూయల్ కెమేరాల వాడకం ఆరేళ్ల కిందటే మొదలైంది. 2011లోనే హెచ్ టీసీ తన ఫోన్లలో ఇలాంటి కెమేరాలను వాడింది. ఆ తరువాత 2014లో మళ్లీ హెచ్ టీసీయే తన వన్ ఎం8 మాడల్ లో ఇలాంటి కెమేరాలు వాడడంతో ఒక్కసారిగా ఈ టెక్నాలజీ పాపులర్ అయింది. 2016లో మార్కెట్లోని అనేక మోడళ్లలో ఈ ఫీచర్ వచ్చేసింది. ఇప్పుడు లెనోవా, వివో సంస్థలకు చెందిన పలు మోడల్లలో ఫ్రంట్ కెమేరాలు కూడా రెండు ఉంటున్నాయి. దీంతో సెల్ఫీ ప్రియులు వీటిపై మోజు పడుతున్నారు. 2017లో డ్యూయల్ కెమేరా ఫోన్లు సరికొత్త ట్రెండుగా మారిపోయాయి. అయితే, ఈ ఫీచర్ ఉన్నవి ప్రస్తుతానికి ధర ఎక్కువగా ఉన్నా కొద్ది నెలల్లో తగ్గుతాయని భావిస్తున్నారు.
లాభాలు..
* మరింత ఫొటో క్లారిటీ
* ఎక్కువ డీటైల్స్ కనిపించడం
* ఎక్కువ దూరం కెమేరా పరిథిలోకి రావడం
* కాంతివంతంగా చిత్రాలు ఉండడం