ఫుడ్ డెలివరీ యాప్స్‌కి పెరుగుతున్న ఆదరణ, తగినంత ఆదాయం చూపించకుండా మోసం చేశారని ఓలా మీద కేసు పెట్టిన డ్రైవర్.. ఇలాంటి విశేషాలతో ఈ వారం టెక్ రౌండప్ మీకోసం..
డిజిటల్, ప్రింట్ ఆదాయం తగ్గిందన్న నెట్‌వర్క్ 18
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి నెట్‌వర్క్ 18 గ్రూప్ 1237 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌తో పోల్చుకుంటే ఇది 9% ఎక్కువ. ప్రస్తుత త్రైమాసికంలోనూ ఆదాయం బాగానే ఉందని ప్రకటించింది. అయితే డిజిటల్, ప్రింట్ విభాగాల్లో మాత్రం 28% ఆదాయం తగ్గిందని చెప్పింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో 54 కోట్ల రూపాయలు సాధించగా ఈసారి 39 కోట్లకే ఆదాయం పరిమితమైంది.
ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీపై మహారాష్ట్ర డైలమా
డ్రంకెన్ డ్రైవ్‌తో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని లిక్కర్‌ను ఆన్‌లైన్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ బవన్‌కులే చెప్పారు.ఆన్‌లైన్ లిక్కర్ పాలసీ ఫైనల్ చేయడానికి చివరి దశలో ఉందని అనౌన్స్ చేశారు. అయితే వెంటనే దీన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపారేశారు. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, తీసుకోబోమని ప్రకటించారు.
హోలా చెఫ్‌తో ఫుడ్‌పాండా చర్చలు
ఫుడ్ డెలివరీ యాప్ ఫుడ్‌పాండా తన సొంత వంటకాలు అమ్మే దిశగా ముందుకెళుతోంది. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలుపెట్టి కొన్నాళ్ల కిందట మూతపడిన హోలాచెఫ్ అనే స్టార్టప్‌ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ డీల్ ఓకే అయితే ఫుడ్ పాండా తన యూజర్లకు వేరే రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడం కాకుండా తన సొంత బ్రాండ్‌తోనే ఫుడ్ అమ్మగలుగుతుంది.
నెలకు 2కోట్ల 10 లక్షల ఫుడ్ ఆర్డర్స్
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్రతి నెలా రెండు కోట్ల 10 లక్షల ఫుడ్ ఆర్డర్లు పొందుతోంది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ప్రకటించారు. దీంతోపాటు ఫోన్ ద్వారా మరో 2 లక్షల ఆర్డర్లు కూడా వస్తున్నాయని చెప్పారు.
ఓలాపై కేసు పెట్టిన పుణె డ్రైవర్
భారీగా ఆదాయం వస్తుందని ప్రకటనలిచ్చి అరకొరగా డబ్బులిచ్చి తనను మోసం చేస్తున్నారని మహారాష్ట్రలోని పుణెకు చెందిన రామ్ సల్గారే అనే క్యాబ్ డ్రైవర్ ఓలాపై కేసు పెట్టాడు. నెలకు 60, 70 వేలు సంపాదించుకోవచ్చని ప్రకటనలిస్తున్న ఓలా భారీ కమిషన్లు తీసుకోవడంతో తమకు ఆరేడు వేలు మించి రావడం లేదని కంప్లయింట్ చేశాడు. మహారాష్ట్రలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అనే రాజకీయ పార్టీ కూడా ఇదే కంప్లయింట్ చేసింది. దేశంలో ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ మీద నమోదయిన తొలి పోలీస్ కంప్లయింట్ ఇదేనట.
గంటల్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చంటున్న యాత్రా.కామ్
ఆన్‌లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సర్వీసులిచ్చే యాత్రా.కామ్ ఫ్లెక్సీ స్టే పేరిట గంటల్లో కూడా గది అద్దెకిచ్చే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అయితే కనీసం 4 గంటలు రూమ్ తీసుకోవాలని పేర్కొంది. ఓలా ఆన్లైన్ యాప్ ద్వారా ఢిల్లీ, బెంగళూరు, షిర్డీ, తిరుపతిల్లో ఈ సౌకర్యం వాడుకోవచ్చు.
ఓలాను వదిలేసిన విరాజ్ చౌహాన్
ట్యాక్సీ ఎగ్రిగేటర్ యాప్ ఓలాలో కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేస్తున్న విరాజ్ చౌహాన్ సంస్థకు గుడ్‌బై చెప్పేశాడు. నవంబర్ 1 నుంచి చౌహాన్ పెప్సికో ఇండియాలో చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా పనిచేయబోతున్నారు. విరాజ్ ప్లేస్‌లో ఓలాకు ఆనంద్ సుబ్రమణియన్ బాధ్యతలు చేపడతారు.
5జీ క్యాపబిలిటీస్ కోసం జిలాబ్స్‌ను యాక్వైర్ చేసిన శాంసంగ్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 5జీ సర్వీస్ క్యాపబిలిటీస్ కోసం జిలాబ్స్ కంపెనీని ఆక్వైర్ చేసింది. నెట్‌వర్క, సర్వీస్ అనలిటిక్స్ కంపెనీగా జిలాబ్స్‌కి మంచి పేరుంది.