సాంకేతిక విప్లవ పుణ్యమా అని కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు మితిమీరిపోతున్నాయి. వీటి ఉపయోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆందోళన ఇలా ఉంటే యూనివర్సిటీ ఆప్ టొలెడో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలవైపు అదేవిదిగా చూస్తూ ఉంటే అంధత్వం వచ్చే అవకాశముంది. 50 ఏళ్ల దగ్గరకు వచ్చేసరికి కంటి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్. దీనివల్ల కంటిలోని రెటీనాపై ప్రతికూల ప్రభావం పడుతోంది. బ్లూ లైట్ కారణంగా కంటి జబ్బులు వస్తున్నాయని నివేదిక తెలిపింది. మరి దీని కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూ లైట్ ఫిల్టర్‌ను ఆన్ చేసుకోవాలి. ఫోన్ సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లూ లైట్ ఫిల్టర్‌ను ఆన్ చేసుకోవచ్చు. అధిక నాణ్యత కలిగిన బ్లూ లైట్ ఫిల్టర్ ఫీచర్ కలిగిన స్క్రీన్ ప్రొటెక్టర్లను ఉపయోగించాలి. మీరు ఒకవేళ ల్యాప్‌టాప్స్‌పై ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే వారానికి ఓ సారైనా కంటి చెకప్‌కు వెళ్లండి. డాక్టర్‌ను సంప్రదించి సరైన ఐడ్రాప్స్ పొందండి.
చీకటి గదిలో లేదా చీకట్లో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూడొచ్చు. మీరు గ్లాసెస్ ఉపయోగిస్తూ ఉంటే.. బ్లూ లైట్, యూవీ ఫిల్టర్స్‌తో కూడిన నాణ్యమైన అద్దాలనే వాడండి. రోజులో అప్పుడప్పుడు కళ్లను నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండటం మంచిది.ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్లను రాత్రిపూట ఉపయోగించకూడదు.
ఒకవేళ ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు సూచిస్తున్నారు.