• తాజా వార్తలు

ఫోన్ నీటిలో పడితే తక్షణం చేయాల్సిన పనులు

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మీ ఫోన్ అనుకోకుండా నీటిలో పడితే తడిసిపోవడమనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిపాటి నీళ్లు పడితే ఏం కాదుగానీ.. పూర్తిగా నీటిలో తడిస్తే ఫోన్ పాడయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు ఫోన్ తడవగానే కొన్ని టిప్స్ పాటించడం వల్ల అది పాడవకుండా జాగ్రత్త పడొచ్చు. ఫోన్ నీటిలో పడగానే వెంటనే బయటకు తీసి.. స్విచ్ఛాఫ్ చేయాలి. నీటిలో ఉండే సమయం పెరిగే కొద్దీ ఫోన్ పాడయ్యే అవకాశాలు పెరుగుతాయి.

ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్‌లో తేమ లేదని నిర్ధారించుకునే వరకు ఫోన్ ఆన్ చేయొద్దు. ఒకవేళ తడిగా ఉన్నప్పుడు ఫోన్ ఆన్ చేస్తే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోన్ పని చేయకుండా పోతుంది.ఫోన్‌ను అటు ఇటు కదపడం, బటన్లు నొక్కడం లాంటివి చేయొద్దు. ఇలా చేస్తే.. నీరు ఫోన్లోకి మరింతగా చొచ్చుకెళ్లే అవకాశాలున్నాయి.

కుదిరితే వెంటనే బ్యాటరీని బయటకు తీసేయండి. ఒకవేళ రిమూవబుల్ బ్యాటరీ కాకపోతే.. దాన్ని తీసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.ఫోన్‌కు రక్షణగా బ్యాక్ పౌచ్‌లు లేదా ఏవైనా కవర్లు వాడుతుంటే వెంటనే వాటిని తీసేయండి. సిమ్ కార్డులు, మెమొరీ కార్డులను కూడా వెంటనే బయటకు తీసేయండి.

పొడి వస్త్రం లేదా టవల్‌తో ఫోన్‌ను తుడవండి. సాధ్యమైనంత వరకు ఫోన్‌పై నీరు లేకుండా గుడ్డతో తుడవండి. నీరు ఫోను లోపలికి ఎక్కువగా వెళ్లిందని భావిస్తే.. వాక్యూమ్ క్లీనర్ ద్వారా దాన్ని తొలగించే ప్రయత్నం చేయండి. అప్పటికీ ఫోన్లో కొద్దిపాటి తేమ ఉండే అవకాశం ఉంది.కాబట్టి ఈ తేమను పోగొట్టడానికి ఒక గిన్నెలో బియ్యం తీసుకొని అందులో ఫోన్‌ను ఉంచండి. బియ్యానికి తేమను పీల్చుకునే గుణం ఉంది.

మరింత మెరుగైన ఫలితం కోసం బియ్యం బదులు సిలికా ప్యాకెట్లను కూడా వాడొచ్చు. ఒకట్రెండు రోజులు ఫోన్‌ను బియ్యంలోనే ఉంచితే తేమ పూర్తిగా తొలగిపోతుంది. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.ఫోన్‌ నుంచి తేమ పూర్తిగా పోయిందని నిర్ధారించుకున్నాక.. స్విచ్ఛాన్ చేయండి. మొబైల్ ఆన్ కాకపోతే ఛార్జింగ్ పెట్టేందకు ప్రయత్నించండి. ఒకవేళ ఛార్జింగ్ కూడా కాకపోతే.. బ్యాటరీ పాడైందని భావించొచ్చు.ఒకవేళ ఆన్ చేసినప్పుడు ఫోన్ పని చేస్తే గనుక.. స్పీకర్లు, మైక్ పాడయ్యాయేమో చెక్ చేయండి. కాల్ చేయడం, పాటలు వినడం ద్వారా ఫోన్ పనితీరులో తేడాను గుర్తించండి. గతంతో పోలిస్తే టచ్ ఎలా పని చేస్తుందో గమనించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే రిపేర్ షాప్‌కి తీసుకెళ్లండి.

జన రంజకమైన వార్తలు