మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గ్రంథాలయంలోని పుస్తకాలను మీరు ఆన్ లైన్లోనే చదివేయవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యువత కోసం ప్రత్యేక జాతీయ గ్రంథాలయ ప్రధాన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్‌లో లభ్యం కానివి సైతం ఇక్కడ ఉన్నాయి. కొంత సమయాన్ని వెచ్చిస్తే..మనకు అవసరమైన పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు దీటుగా తయారు కావొచ్చు. కాగా ఇందులో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి. మరి వాటిని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.
లాగిన్ కావడం ఎలా..?
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రూపొందించిన జాతీయ ఈ-గ్రంథాలయంలో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఎన్‌డీఎల్. ఐఐటీకేజీపీ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. అక్కడ మీకు కనిపించే అంశాలను చూసుకుంటూ వ్యక్తిగతంగా, సంస్థలపరంగా సమాచారాన్ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇందులో ఈ-మెయిల్, చిరునామా వివరాలు నమోదు చేయాలి. ఒకసారి నమోదు చేసుకుంటే ఎప్పుడైనా మనకు కావాల్సిన పుస్తకాలను చదువుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే మనం ఇచ్చిన పాస్‌వర్డ్, యూజర్ ఐడీని మాత్రం మరువకూడదు. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు కలిగిన వారంతా ఇంట్లోనే కూర్చోని నెట్‌లో పుస్తకాలు చదువుకోవచ్చు. అంతేకాకుండా మనకు కావాల్సినవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Books
ఇందులో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి. ఇందులో 31 లక్షల మంది రాసిన పుస్తకాలు 70 భాషల్లో లభ్యమవుతున్నాయి. మొత్తం ఏడు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఏ రకం పుస్తకం కావాలో దానిపై క్లిక్ చేస్తే తెరపైకి వస్తుంది. సమాచారాన్ని ఒక నోట్సు రూపంలో రాసుకుంటే రాబోయే రోజుల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది.
Articles
ఇందులో మూడు లక్షల వ్యాసాలకు చోటిచ్చారు. సివిల్స్ గ్రూప్స్ తదితర ఉన్నత ఉద్యోగాలు రాసే అభ్యర్థులకు ఈ వ్యాసాలు సద్వినియోగం అవుతాయి.
థిసిస్ : ఇందులో 95వేల అధ్యయనాలు ఉన్నాయి. పరిశోధన చేస్తున్న అభ్యర్థులకు కావాల్సిన సమాచారం ఇందులో లభించే అవకాశం ఉంటుంది.
రాత పుస్తకాలు : ఇది కూడా పై మాదిరిగానే కావాల్సిన సమాచారం లభించేలా ఉన్నాయి.
Audio lectures
ఇందులో 262 శబ్ధగ్రహణ ఉపన్యాసాలు పొందుపర్చారు. మనకు కావాల్సిన ఉపన్యాసాలు ఇందులో చూసుకోవచ్చు.
వీడియో లెక్చర్స్ : ఇందులో దృశ్యశ్రవణ ఉపన్యాసాలు. 18వేల వరకు అందుబాటులో ఉన్నాయి.
Feature resource
ఈ విభాగంలో ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన వివిధ పాఠ్యాంశాలకు చెందిన పుస్తకాలు అంగ్లభాషలో లభ్యమవుతాయి. వ్యవసాయాభివృద్ధి, సమస్యలు, పరిష్కరాలు తదితర అంశాలకు చెందిన 50వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విశ్వవిద్యాలయాల నిపుణులు రూపొందించిన ప్రత్యేక పరిశోధన వ్యాసాలు 38వేలు వరకు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పుస్తకాలకు జాతీయ ఈ-గ్రంథాలయంలో చోటు కల్పించారు.
విషయ పరిజ్ఞాన పుస్తకాలు:
ఈ-గ్రంథాలయంలో సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన పుస్తకాలకు చోటిచ్చారు. ఇందులో నాలుగు విభాగాలున్నాయి.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ : ఇందులో ఇంజనీరింగు అభ్యర్థులకు కావాల్సిన కంప్యూటర్ ఆధారిత పూర్తి సమాచారం లభిస్తుంది.
philosophy and psychology
ఇందులో ఎడ్యూకేషన్ రీసెర్చ్(విద్యా పరిశోధన), మెటా ఫిజిక్స్, ఓంటోలజి, కాస్మోలజీ, టెలియోలజీ, ఎథిక్స్ తదితర విభాగాలకు చోటిచ్చారు.
మతం : ఇందులో ఫిలాసఫీ, దేవతలు, సైన్సుకు మతానికి గల సంబంధం తదితర అంశాలకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.
సోషల్ సైన్సెస్ : ఇందులో సామాజిక శాస్త్రం, ఆంథ్రోపాలజీ, సమాజంలో మానవుల ప్రవర్తన, రాజనీతి శాస్త్రం, అర్థశాస్తం, చరిత్ర, న్యాయశాస్త్రం, ప్రజాపరిపాలన తదితర పాఠ్యాంశాలకు చోటు కల్పించారు.