• తాజా వార్తలు

టీటీఈతో సంబంధం లేకుండా రైలులో ఖాళీ బెర్తుల వివ‌రాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌. ఇకపై మీరు రైలులో ఖాళీగా ఉండే బెర్తుల కోసం టీటీఈల వ‌ద్ద‌కు ప‌రిగెత్తాల్సిన ప‌నిలేదు. ఏ రైలులో అయినా రిజ‌ర్వేష‌న్ చేయించుకున్నాక బెర్త్ దొర‌క‌క‌పోతే ట్రెయిన్ బ‌య‌ల్దేర‌డానికి ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యే స‌మ‌యంలో ఆ రైలులో ఆయా కోచ్‌ల‌లో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాలు మీకు ఇట్టే తెలిసిపోతాయి. అందుకు గాను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌ల‌లో కొత్త‌గా ఓ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అదే చార్ట్స్‌/ వెకెన్సీ ఫీచర్‌.

ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ లో ప్ర‌యాణికులు తాము వెళ్లాల‌నుకునే ఫ్ర‌మ్‌, టు స్టేష‌న్ల వివ‌రాలు, తేదీ ఎంట‌ర్ చేసి కింద ఉండే చార్ట్స్/వెకెన్సీ ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే ఓ విండో వస్తుంది. అందులో తాము ప్ర‌యాణం చేసే ట్రెయిన్ నంబ‌ర్‌, తేదీ, బోర్డింగ్ వివ‌రాల‌ను ఎంటర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే మ‌రో విండో వ‌స్తుంది. 

త‌రువాత వ‌చ్చే విండోలో ఆ ట్రెయిన్‌కు చెందిన అన్ని కోచ్‌ల నంబ‌ర్లు క‌నిపిస్తాయి. వాటిలో దేన్న‌యినా ఎంచుకుంటే ఆ కోచ్‌లో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాలు గ్రీన్ క‌ల‌ర్‌లో ఉంటాయి. దీంతో ప్ర‌యాణికులు ఖాళీగా ఉన్న బెర్త్ నంబ‌ర్ల‌ను నోట్ చేసుకుని వాటిని టీటీఈకి చెబితే టీటీఈ ప్రయాణికుల‌కు ఆ బెర్త్‌ను కేటాయిస్తారు. 

గ్రీన్ క‌ల‌ర్‌లో బెర్త్ ఉంటే అది ఖాళీగా ఉంద‌ని, ఎల్లో క‌ల‌ర్ ఉంటే మార్గ మ‌ధ్య‌లో ఖాళీ అవుతుంద‌ని తెలుసుకోవాలి. గ్రీన్ క‌ల‌ర్ బెర్త్ నంబ‌ర్ చూసుకుని టీటీఈని సంప్ర‌దిస్తే ఆ బెర్త్‌ను టీటీఈ ప్ర‌యాణికుల‌కు కేటాయిస్తారు.

దీని వ‌ల్ల టీటీఈలు రైలులో బెర్తులు ఖాళీ లేవ‌ని చెప్ప‌డం కుద‌రదు. ఈ క్ర‌మంలోనే రైలు ప్రారంభ‌మ‌య్యే ముందు ప్రిపేర్ అయ్యే చార్టులు రెండింటినీ ఆన్‌లైన్‌లో పొందు ప‌రుస్తారు. దీని వ‌ల్ల రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాలు ప్ర‌యాణికులకు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా సైట్‌లో సుల‌భంగా తెలుస్తాయి.

సాధార‌ణంగా రైలు బ‌యల్దేర‌డానికి 4 గంట‌ల ముందు మొద‌టి చార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. దీంతో ఆ చార్ట్‌ను ప్ర‌యాణికులు ఆన్ లైన్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే రైలు బ‌య‌ల్దేర‌డానికి 30 నిమిషాల ముందు రెండో చార్ట్‌ను ప్రిపేర్ చేస్తారు. మొద‌టి చార్ట్ ప్రిపేర్ అయ్యాక రైలులో ఆయా కోచ్‌ల‌లోని బెర్తుల‌కు గాను క‌న్‌ఫాం అయిన రిజ‌ర్వేష‌న్లు, క్యాన్సిలేష‌న్ అయిన‌వి, మార్పులు త‌దిత‌ర వివ‌రాల‌ను రెండో చార్టులో ఇస్తారు. దీంతో రైలులో బెర్తులు ఏయే కోచ్‌ల‌లో ఖాళీగా ఉన్నాయో ఆన్‌లైన్‌లో ప్ర‌యాణికుల‌కు సుల‌భంగా తెలుస్తుంది. వాటి వివ‌రాల‌ను తెలుసుకుంటే బెర్త్ పొంద‌డం చాలా తేలిక‌వుతుంది.
 

జన రంజకమైన వార్తలు