ప్రైవేట్ కంపెనీలు వ్యక్తుల ఆధార్ డేటాను తమవద్ద ఉంచుకోరాదని సుప్రీం కోర్టు కఠినంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్‌లైన్‌ద్వారా ఆధార్ కేవైసీ పద్ధతిని పాటించాల్సిందిగా ప్రభుత్వం ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీవసంబంధ (బయోమెట్రిక్) వివరాల పరిశీలనతో సంబంధం లేకుండా కేవైసీని పాటించేందుకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు. పైగా ఇవి 100 శాతం సురక్షితమని, హ్యాకింగ్‌తోపాటు అపహరణకు వీలుండదని వారు అంటున్నారు. వేగంగా ప్రాచుర్యం పొందడంతోపాటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్న ఈ రెండు ఆఫ్‌లైన్ విధానాలను ఓ సారి పరిశీలిద్దాం:
మొదటి పద్ధతి... QR కోడ్స్
ఈ పద్ధతి గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీని సాయంతో ఎవరి ఆధార్ డేటానైనా పరిశీలించి నిర్ధారించే వీలుంది. ఈ విధానంలో వినియోగదారు విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ-UIDAI వెబ్‌సైట్ నుంచి QR కోడ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరాన్నిబట్టి QR కోడ్స్ మూడు రకాలుగా ఉంటాయి. రెండు రకాల కోడ్‌లలో జనసంబంధ వివరాలు, ఫొటో ఉంటాయి. మూడో రకం కోడ్‌లో జనసంబంధ డేటా ఒక్కటే ఉంటుంది. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న QR కోడ్స్‌ను కేవైసీ కోరే బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లువంటి పార్టీలకు వినియోగదారు అందజేయవచ్చు. వీటిని తనిఖీ చేసుకోవడానికి ఆ పార్టీలు ఇంటర్నెట్ నుంచి QR కోడ్ రీడర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి రావచ్చు. కనుక బయోమెట్రిక్ వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేకుండా ఆధార్ కేవైసీని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు.
రెండో పద్ధతి... కాగితరహిత eKYC ఫారాలు
వీటిని కూడా UIDAI వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరాన్నిబట్టి eKYC ఫారాలలో ఆధార్ డేటా కనిపించే ఆప్షన్‌ను వినియోగదారు ఎంచుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రధానంగా ఐదు ఆప్షన్లు ఉన్నాయి. పేరు, చిరునామా సహజంగానే కనిపిస్తాయి. అయితే... మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, జెండర్ వంటి వివరాలలో మనకు అవసరమైనదాన్ని మాత్రమే కనిపించేలా చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న eKYC ఫారాలను ప్రింట్ తీసుకుని ఆధార్ తనిఖీ కోరిన పార్టీలకు పంపించవచ్చు. ఈ విధానంలోనూ బయోమెట్రిక్ వివరాలు పంచుకునే అవసరం ఉండదు. అలాగే సమాచార బదిలీ 100 శాతం ఆఫ్‌లైన్‌లోనూ పూర్తవుతుంది.
ఆఫ్‌లైన్ విధానాలు ఎలా సురక్షితం?
వినియోగదారు నేరుగా UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నందువల్ల ఆధార్ వివరాల తనిఖీకోసం మూడో పక్షం (థర్డ్ పార్టీ) UIDAI సేవలను కోరే అవసరం ఉండదు. కాబట్టి ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి సురక్షితం, భద్రం కూడా! అంతేకాకుండా QR కోడ్స్, eKYC ఫారాలను ఎందుకు, ఎక్కడ ఉపయోగించిందీ UIDAIకి కూడా తెలియదు. బ్యాంకులలో కొత్త ఖాతా తెరవడానికి లేదా కొత్త సిమ్ కార్డు తీసుకోవడానికి ఈ పద్ధతులను వాడుకోవచ్చు. తద్వారా వినియోగదారు వ్యక్తిగత గోప్యత, డేటా కూడా సురక్షితంగా ఉంటాయి. మూడో పక్షం సంస్థలు ఈ సమాచారాన్ని డిజిటల్‌గా నిల్వ చేసే వీలు కూడా ఉండదు. అందుకే ప్రభుత్వం కూడా ఈ పద్ధతులను ప్రోత్సహిస్తోంది. కాబట్టి త్వరలోనే ఇవి ప్రధాన స్రవంతి పద్ధతుగా రూపాంతరం చెందబోతున్నాయి.