నాణ్యమైన సర్వీసులు అందించక పొతే ఇది మొదలే-ట్రాయ్ దేశంలో టెలికాం సేవాలోపాలు అన్నీ ఇన్నీ కావు. అయితే... వాటిపై ఫిర్యాదు చేసే వినియోగదారులు బాగా తక్కువ. ట్రాయ్ కలగజేసుకుని చర్యలు తీసుకోవడమూ తక్కువే. అయితే... కొన్ని విషయాల్లో మాత్రం ట్రాయ్ టెలికాం కంపెనీల విషయంలో గట్టిగానే వ్యవహరిస్తోంది. టెలికాం సేవల నాణ్యత లోపాలు, నియమాల ఉల్లంఘనకు సంబంధి ఏడాది కాలంలో ట్రాయ్ టెలికాం సంస్థలకు 6 కోట్ల జరిమానా విధించింది. 2014 జులై నుంచి 2015 జూన్ వరకు కాలానికి దేశంలో టెలికాం సంస్థలు 6 కోట్ల జరిమానా కట్టాయట. టెలికాం రెగ్యులేటరీ అధారిటీ వార్షిక నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ జరిమానాల్లో ఎక్కువగా మొబైల్ సర్వీసు ప్రొవైడర్ల నుంచే వచ్చాయి. వారు మొత్తం 3.48 కోట్లు కట్టగా ఫిక్సుడు లైన్ ఆపరేటర్లు 44.5 లక్షలు జరిమానా చెల్లించుకున్నారు. ఇక బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ల జరిమానా వాటా 21.75 లక్షలు. ఇతర జరిమానాలు మరికొంత వసూలయ్యాయి. మొత్తం 200కిపైగా షో కాజ్ నోటీసులను జారీ చేసింది ట్రాయ్. 2015 అక్టోబరు వరకు ఉన్న ట్రాయ్ నిబంధనల ప్రకారం నెట్ వర్క్ క్వాలిటీకి సంబంధించిన ఉల్లంఘనలకు తొలిసారికి 50 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నుంచి రూ.లక్ష జరిమానా పడుతుంది. అయితే... వినియోగదారులకు కలిగిన సేవాలోపాలపై జరిమానా గరిష్ఠంగా 50 వేలకే పరిమితం. అయితే.. గత ఏడాది అక్టోబరు తరువాత జరిమానాలు పెంచారు. సర్వీసు క్వాలిటీకి సంబంధించి తొలి ఉల్లంఘనకు రూ.లక్ష...రెండోసారికి రూ.1.5 లక్షలు.. మూడోసారి, ఆ తరువాత నుంచి రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. |