దిల్లీ మెట్రో సర్వీసును ఉపయోగించే ప్రయాణీకులకు శుభవార్త. ప్రయాణీకులకు వైఫై సదుపాయాన్ని కల్పించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నిర్ణయించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా 222 రైళ్లు, 187 స్టేషన్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త పద్ధతి ద్వారా 250 కిలోమీటర్ల మేరకు వైఫై అందుబాటులో ఉండబోతోంది. ఈ వైఫై కనీసం 50 ఎంబీపీఎస్ కనీస వేగంతో పనిచేయనుంది. వేవ్ పరిథుల మేరకు ఈ వినియోగం 1.6 జీబీపీఎస్ వరకు ఉంటుందని డీఎంఆర్‌సీ తెలియజేసింది. 2.75 మిలియన్ల ఢిల్లీ ప్యాసింజర్ల కోసం ఈ సదుపాయాన్ని ప్రత్యేకించి ప్రవేశపెట్టామని ఈ సంస్థ వెల్లడించింది. టెక్నో సాట్.కాం మరియు పింగ్ నెట్‌వర్క్‌లు కలిసి ఈ ప్రాజెక్టు తలపెట్టాయి. ఇలా ఎంతపెద్ద ఎత్తున వైఫై సేవలు అందిస్తున్న తొలి రైల్వే నెట్‌వర్క్ గా ఢిల్లీ మెట్రో రైల్ రికార్డులకు ఎక్కనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ వైఫై సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఎన్‌సీఆర్ రీజియన్‌లో యాప్ ద్వారా ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతుందో... ఎంతసేపట్లో గమ్యస్థానాన్ని చేరుతుందో కూడా ఈ యాప్ తెలియజేస్తుంది. టెక్నో సాట్ కమ్యునికేషన్ సంస్థ ఇప్పటికే ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వైఫై సర్వీసును అందిస్తోంది. టీ-ట్రాక్ 2.0 వేవ్ 2 సొల్యూషన్‌ను ఈ యాప్‌లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ఉండే అధిక వేడి, చలి, వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నింటికి అనుగుణంగా పని చేసేలా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ సర్వీసులకు పింగ్ సంస్థ కూడా సహకారం అందిస్తోంది. పింగ్ సంస్థ ప్రస్తుతం ఇండియా ఫుడ్ నెట్ బూమ్ సంస్థలకు సర్వీసులు అందిస్తోంది. ఈ వైఫై సర్వీసులతో లక్షలాది మంది ప్రయణీకులు హెచ్‌డీ క్వాలిటీ ఉన్న వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉండే సమయాల్లో ఈ వైఫై సౌకర్యం ఇంకా ఎక్కువగా ఉపయోగపడనుంది. ప్రపంచంలో ఎక్కువమంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్న మెట్రోల్లో ఢిల్లీది అగ్రస్థానం. దాదాపు 3.5 మిలియన్ల ప్రయాణీకులు నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. 2016లో మరిన్ని కొత్త రైళ్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. |