నోయిడాకు చెందిన ప్రముఖ సాంకేతిక వస్తువుల తయారీ సంస్థ డిక్సన్ మరో పెద్ద ప్రాజెక్టు కోసం సిద్దమవుతోంది. 4జీ, 3జీ స్మార్టు ఫోన్ల తయారీ కోసం ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ జియోనితో ఒప్పందం చేసుకుంది. డిక్సన్ సంస్థ ఈ మే నెల నుంచి ఈ ఫోన్ల తయారీని చేపట్టనుంది. ఇలా జియోనితో స్మార్టుఫోన్ల తయారీకి ఒప్పందం చేసుకున్న రెండో భారత సంస్థ డిక్సన్. ఇంతకుముందు ఫాక్స్‌కాన్ స్మార్టుఫోన్ల తయారీకి ఒప్పందం చేసుకుంది. వచ్చే నెల నుంచి జియోని-పి సిరీస్ 3జీ, 4జీ మోడల్ స్మార్టుఫోన్లను తయారు చేయాలని డిక్సన్ నిర్ణయించింది. జులై నాటికల్లా జియాని-ఎఫ్ సిరీస్‌ను తయారు చేయడానికి డిక్సన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునేలా జియోని పి, ఎఫ్ సిరీస్‌లను రూపొందిస్తామని డిక్సన్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా తెలిపారు. జియోని-పి సిరీస్ మోడల్ ధర రూ.6000 వేలు ఉంటుందని.. అదే జియోని-ఎఫ్ సిరీస్ ధర రూ.10000 వేలు ఉంటుందని డిక్సన్ కంపెనీ వెల్లడించింది. భారత ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మేకిన్ ఇండియా పథకంలో భాగంగా డిక్సన్ ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు స్మార్టుఫోన్ల తయారీ కోసం తైవాన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థ మొబైళ్ల తయారీలో నిమగ్నమైంది. జియోని స్థానిక ఫోన్ల తయారీలో 50 నుంచి 60 శాతం ఫాక్స్‌కాన్ సంస్థే ప్రధాన పాత్ర పోషించనుంది. మిగిలిన ఫోన్ల తయారీ బాధ్యతలను నోయిడా కేంద్రంగా ఉన్న డిక్సన్ కంపెనీ పంచుకోనుంది. జియోని స్మార్టుఫోన్ల తయారీ కోసం డిక్సన్ కంపెనీ యుద్ధ ప్రాదిపదికన వేగంగా పనులు చేస్తోంది. దీని కోసం మూడు ప్రత్యేక ప్రొడక్షన్ యూనిట్లను సిద్ధం చేసింది. అవసరమైతే మరో మూడు ప్రొడక్షన్ యూనిట్లను సిద్ధం చేసి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది డిక్సన్ కంపెనీ యోచన. ప్రస్తుతం జియోని కంపెనీ భారత్‌లో ఏడాదికి 4.8 మిలియన్ల స్మార్టుఫోన్లను అమ్ముతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరికి ఈ ఫోన్ల అమ్మకాలను 8 మిలియన్లకు పెంచుకోవాలని జియోని ప్రణాళికలు రచిస్తోంది. |