ఇంటర్నెట్ అధికంగా ఉపయోగించే దేశాల్లో భారత్ ముందంజలో ఉంటుంది. ముఖ్యంగా ఇ-కామర్స్‌లో భారత్ దూసుకుపోతోంది. ఏడాది ఏడాదికి ఈ రంగంలో భారత్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు సాగుతోంది. భారత్‌లో మూడేళ్ల కాలంలోనే ఈ-కామర్స్ వ్యాపారం మూడింతలు పెరిగిందట. గత ఐదేళ్లలో ఇ-కామర్స్ వ్యాపారా 209 శాతం వృద్ధి సాధించిందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2010లో 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇ-కామర్స్ వ్యాపారం 2014 నాటికి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుందట. 2016 ఏడాది చివరికి ఇ-కామర్స్ వ్యాపారం 38 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అసోచాం సంస్థ తెలిపింది. 2020 నాటికి ఈ వ్యాపారం ఊహించనంత ఎత్తుకు చేరుకుంటుందని అసోచాం భావిస్తోంది. ఆన్‌లైన్ వ్యాపారం ఇదే జోరుతో కొనసాగితే 2020 నాటికి ఆన్‌లైన్ వ్యాపారం రూ.6,60,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అసోచాం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇ-కామర్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త కొత్త మార్గాల ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి అన్ని ప్రధాన కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఐతే సర్వీసుల ట్యాక్సులు, ఇతర లాజిస్టిక్స్ మరింత సరళీకృతం అయితే ఇ-కామర్స్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలిపింది. భారత్‌లో వినూత్న మార్పులకు ఇ-కామర్స్ దోహదం చేస్తుందని సీఐఐ తెలిపింది. భారత్‌లో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరగడమే దీనికి కారణటమట. 2015 సెప్టెంబర్ నాటికి భారత్‌లో ఇంటర్నెట్ ఉపయోగించే యూజర్ల సంఖ్య 354 మిలియన్లుగా ఉంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వారి సంఖ్య 2013లో 20 మిలియన్లుగా ఉంటే.. 2015 నాటికి అది 39 మిలియన్లకు చేరుకుందట. మూడేళ్ల కాలంలో ఇంటర్నెట్ వాడకదారుల శాతం 95 శాతం పెరిగిందట. అయితే డేటా ధరలు ఎక్కువగా ఉన్నా.. భారత్‌లో ఇంకా చాలా చోట్ల ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉన్నా... ఇ-కామర్స్ వ్యాపారానికి మాత్రం ఎలాంటి ఢోకా ఉండట్లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీప్, షాప్‌క్లూస్, పేటీఎమ్ లాంటి ఆన్‌లైన్ స్టోర్లు అన్ని రకాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ ఆన్‌లైన్ మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు కూడా తోడవుతున్నాయి. |