ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్‌లో తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత్‌లోని ఐదు ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో వైఫై సేవలను అందించనుంది. ఈ హైస్పీడ్ పబ్లిక్ వైఫై సర్వీసులను ఉజ్జయిని, జైపూర్, పట్నా, గౌహతి, అలహాబాద్ రైల్వే స్టేషన్లలో అందించడానికి గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. భారత వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సర్వీసులు అందించే ప్రాజెక్టులో భాగంగా ముందస్తుగా ఈ నాలుగు నగరాల్లో ఈ సర్వీసులు అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ ఏడాది చివరికి మిగిలిన నగరాల్లోని రైల్వే స్టేషన్లోనూ ఈ సర్వీసులు అందిస్తామని గూగుల్ చెప్పింది. త్వరలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. రైల్‌వైర్ పేరుతో అత్యున్నత ప్రమాణాలతో ఈ ఇంటర్‌నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు గూగుల్ చెప్పింది. త్వరలోనే దేశంలోని 15 స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్లో విజయవంతంగా వైఫైని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మిగిలిన నగరాల్లోనూ రైల్ టెల్ సాయంతో గూగుల్ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. ముంబయి సబర్బన్ స్టేషన్లలో ఈ వైఫై సేవలు విస్తరించాలని గూగుల్ భావిస్తోంది. దీనిలో భాగంగా దాదర్, బాంద్రా టెర్మినస్, చర్చ్‌గేట్, థానె, కల్యాణ్, పాన్‌వెల్, వశి, కుర్లా, చత్రపతి శివాజీ టెర్నినస్, బొరివాలి స్టేఫన్లలో ఈ వైఫై సేవలు ప్రవేశపెట్టాలనేది గూగుల్ ఉద్దేశం. ఈ సర్వీసులను ప్రతి వారం 2.5 లక్షల మంది ప్రయాణీకులు ఉపయోగించుకుంటున్నారని గూగుల్ తెలిపింది. ఈ ఏడాది ఆఖరికి 10 మిలియన్ల మంది భారతీయులు ఈ వైఫై సర్వీసులను ఉపయోగించుకుంటారని గూగుల్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను కవర్ చేయాలనేది గూగుల్ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఈ హైస్పీడ్ వైఫై మంబయి సెంట్రల్, పుణె, భువనేశ్వర్, భోపాల్, రాంచీ, రాయ్‌పూర్, విజయవాడ, కాచిగూడ, ఎర్నాకులం జెంక్షన్ విశాఖపట్నం, జైపూర్, పట్నా, గౌహతి, ఉజ్జయిని, అలహాబాద్‌లతో లభ్యం అవుతోంది. |