• తాజా వార్తలు

డిజిటల్ ఇండియా లో భాగంగా నాలుగు మొబైల్ ఆరోగ్య సేవలు ప్రారంభం

రోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశం తో ,ఆరోగ్య రంగం లో నాలుగు సరికొత్త మొబైల్ హెల్త్ సర్వీస్ లను భారత ప్రభుత్వం ప్రారంభించింది.కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీ జే.ఫై. నడ్డా వీటిని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని m-హెల్త్ అని పిలుస్తున్నారు.ఈ m-హెల్త్ కార్యక్రమంలో మొత్తం నాలుగు రకాల సేవలను లాంచ్ చేశారు.

అవి...

  • కిల్ కరి

  • మొబైల్ అకాడెమీ

  • M –సేస్సేషన్

  • TB మిస్స్డ్ కాల్ ఇనిషియేటివ్


ఈ నాలుగు కార్యక్రమాలు ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా లాంచ్ చేయబడ్డాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం లో ప్రజల ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి చెప్పారు .


కిల్ కరి :-  కిల్ కరి అంటే పసి పిల్లల అరుపు అని అర్థం వస్తుంది. గర్భవతులుగా ఉన్న మహిళల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఇది. మహిళ గర్భం దాల్చిన రెండవ నెలనుండీ గర్భస్థ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చైల్డ్ కేర్ గురించీ  72 ఆడియో మెసేజ్ లను వారియొక్క మొబైల్ ఫోన్ లకు డైరెక్ట్ గా పంపిస్తారు. ప్రసవం జరిగిన తర్వాత బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఈ మెసేజ్ లను పంపిస్తూనే ఉంటారు. ఈ పథకం యొక్క మొదట విడత లో భాగంగా ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ ,మరియు రాజస్తాన్ మధ్య ప్రదేశ్ లలోని అధిక ప్రాధాన్యత కలిగిన జిల్లాలలో దీనిని లాంచ్ చేసారు.

మొబైల్ అకాడమీ :-  (Accrediated Social Health Activists )ఆశా కార్యకర్తల కోసం నిర్దేశించి నదే ఈ మొబైల్ అకాడమీ పథకం. ఆశా కార్యకర్తల యొక్క జ్ఞానాన్నీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆశా కార్యకర్తల మొబైల్ ఫోన్ ల ద్వారా ఖర్చు లేని అత్యంత సమర్థ వంతమైన శిక్షణ అందిస్తారు.ఇదే ట్రైనింగ్ కోసం ఆశా కార్యకర్తలు ఎక్కువ దూరాలు ప్రయాణం చేసి, అక్కడ వసతి ఇలాంటి ఇబ్బందులు పడకుండా వారున్న ప్రదేశాలలో నే మొబైల్ ద్వారా వారికీ శిక్షణ ఇస్తారు. ఈ పథకం ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్,రాజస్తాన్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో లాంచ్ చేయబడింది.

M- సేస్సేషన్ :-  ధూమపానం అలవాటుగా ఉన్న వారికోసo ప్రవేశ పెట్టబడిన పథకమే ఈ m-సేస్సేషన్. ఎవరైతే ధూమపానాన్ని వదలి వేయాలని అనుకుంటారో వారు తమ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకుంటే చాలు. పొగ త్రాగడం వలన వచ్చే అనర్థాలు, ధూమపానాన్ని వదలి వేయడం వలన వచ్చే ప్రయోజనాలను ఎడతెరిపి లేకుండా వారి మొబైల్ నెంబర్ కు టెక్స్ట్ మెసేజ్ ల రూపం లో పంపిస్తూనే ఉంటారు. m-హెల్త్ పథకం లో ఉన్న మిగతా కార్య క్రమాల లాగే ఇది కూడా ఖర్చు లేనిది మరియు సమర్థ వంతమైనది.అదియును గాక ఈ తరహా పథకం ప్రపంచం లోనే ఇది మొదటిది.

TB మిస్డ్ కాల్ ఇనిషియేటివ్ :- TB వ్యాధి గ్రస్తుల కోసం రూపొందించిన పథకమే ఈ TB మిస్డ్ కాల్ ఇనిషియేటివ్.ఈ పథకం లో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తారు. TB వ్యాధి గురించిన సమాచారం, కౌన్సిలింగ్, మరియు ట్రీట్ మెంట్ తదితర సేవలను ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి పొందవచ్చు.ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు పైన చెప్పిన విషయాలన్నీ మీకు ఫోన్ ద్వారా అందుతాయి.మొదటగా ఈ పథకం పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు ఢిల్లీ రాష్ట్రాలలో అందుబాటులోనికి రానుంది.

ప్రజల ఆరోగ్యం కోసం భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ మహత్తరమైన కార్య క్రమంలో గేట్స్ ఫౌండేషన్, UNICEF, USAID మరియు కొన్ని స్వచ్చంద సంస్థలు పాలు పంచుకుంటూ తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయి.

 

జన రంజకమైన వార్తలు