కంప్యూటర్ గురించి తెలిసినవాళ్లకు గూగుల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెట్ వాడే వాళ్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్ చిరపరిచితం. అందుకే తాజా సర్వేల్లో కూడా గూగులే ముందంజలో నిలిచింది. భారత్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న విదేశీ బ్రాండ్లపై నిర్వహించిన సర్వేలో గూగుల్ అగ్రస్థానం సాధించింది. గూగుల్ తర్వాత భారత ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఫేస్‌బుక్కే. భారత్‌లో కోట్ల సంఖ్యలో ఎఫ్‌బీ అకౌంట్లు ఉన్నాయి. ఎఫ్‌బీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవలే భారత పర్యటనలో ఇక్కడ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఫేస్‌బుక్ వాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎఫ్‌బీ ఎదగడానికి భారత్‌కు మించిన శక్తివంతమైన స్థానం మరొకటి ఉండదని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. భారత్‌పై ప్రభావం చూపిస్తున్న 10 అంతర్జాతీయ బ్రాండ్‌లలో గూగుల్ ముందుంటే ఆ తర్వాత ఫేస్‌బుక్, జీ మెయిల్, మైక్రోసాఫ్ట్, శామ్‌సంగ్ ఉన్నాయి. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్ ఏడో స్థానంలో ఉంది. మరో విదేశీ బ్రాండ్ వాట్సప్ ఈ జాబితాలో ఆరో స్థానం సంపాదించింది. ఐతే భారత్‌లో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న స్వదేశీ బ్రాండ్ మాత్రం ఫ్లిప్‌కార్టే. తర్వాత ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్ కంపెనీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన అమేజాన్ సంస్థ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ బ్రాండ్‌లన్నిటికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని వీటి వాడకం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదని ఈ సర్వే తెలిపింది. సొసైటీ వేగంగా అభివృద్ధి చెందడానికి, ప్రపంచం ఏకం కావడానికి ఈ బ్రాండ్ల విస్తరణ ఎంతో కీలకమని, ప్రజలు స్వదేశీ, విదేశీ అని తేడా లేకుండా ఏ కంపెనీ ఉత్తమమైన సేవలు అందిస్తుంటే ఆ కంపెనీ వస్తువులు కొనేందుకు ముందుకు వస్తున్నారని ఇప్సోస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ అబార్కర్ చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో 21 దేశాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తున్న బ్రాండ్‌ల గురించి ఇప్సోస్ సర్వే చేసింది. 100 బ్రాండ్ల గురించి జరిగిన ఈ సర్వేలో దాదాపు 36,600 ఇంటర్య్వూలను నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆస్ర్టేలియా, బెల్జియం, బ్రిటన్, చైనా, అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఈ సర్వేలు నిర్వహించారు. ఐతే భారత్‌లో ఇలాంటి పరిశోధన జరగడం ఇదే తొలిసారి. 100 బ్రాండ్ల గుంచి 1000 మంది భారతీయుల దగ్గర నుంచి అభిప్రాయలు సేకరించారు. దీని వల్ల ఏ బ్రాండ్‌కు ఎంత విలువుందో, ఏ బ్రాండ్‌పై ప్రజలు మక్కువ చూపుతున్నారో అన్న విషయాలపై ఒక అవగాహన వచ్చిందని ఇప్సోస్ తెలిపింది. |