భారత్‌లో ఇటీవల కాలంలో విశేష ఆదరణ పొందిన మొబైల్ ఏదైనా ఉందంటే అది లీ ఎకోనే! ఆన్‌లైన్‌లో రికార్డు సంఖ్యలో అమ్మకాలు జరిపిందీ సంస్థ. భారత్‌లో తమ సంస్థకు ఉన్న ఆదరణను మరింత సొమ్ము చేసుకోవాలని ఈ చైనా మొబైల్ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే భారత్‌లో తయారీ కేంద్రంతో పాటు పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని లీ ఎకో నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాల్లో భాగంగా భారత్‌లో అంకుర సంస్థలు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులు గణనీయంగా పెంచుకోవాలని లీ ఎకో ఆలోచన. భారత్‌లో ఉన్న రిటైల్, ఆన్‌లైన్ మార్కెట్లతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చేయగల వనరులను చూసి లీ ఎకో ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆ సంస్థ తెలిపింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ లైసెన్స్ కోసం ఇప్పటికే భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని, ఫారెన్ ఇన్విస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈ కంపెనీ తయారీ కేంద్రాలుగా తమకు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయ్‌పూర్, భోపాల్, బిల్వడ (రాజస్థాన్)లను సూచించిందని లీ ఎకో చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా 2 లక్షల స్మార్టుఫోన్లను భారత్‌లో ఇప్పటిదాకా అమ్మినట్లు లీ ఎకో తెలిపింది. భారత్ దేశం మొత్తం మీద ఎనిమిది లీ ఎకో స్టోర్లు, 500 ఫ్రాంఛైజీ స్టోర్లు ఏర్పాటు చేయాలని లీ ఏకో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టాలని లీ ఎకో చూస్తోంది. ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లలో లీ ఎకో స్టోర్లు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టోర్లు కేవలం లీ ఎకో స్మార్టు ఫోన్లతో పాటు లీ ఎకో టెలివిజన్లు, వర్చువల్ రియాలిటీ, హెడ్‌సెట్స్, బ్లూటూత్‌లు, పవర్ బ్యాంకులు ఈ స్టోర్లలో అమ్మనున్నారు. తాజా లెక్కల ప్రకారం భారత్‌లో స్మార్టుఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య 220 మిలియన్లకు చేరుకుందట. ఈ విషయంలో మన దేశం ఇటీవలే అమెరికాను కూడా దాటింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌పై పట్టు సాధించాలనేది లీ ఎకో వ్యూహం. స్మార్టుఫోన్ల వినియోగంలో చైనా ముందంజలో ఉంది. భారత్‌లో వినియోగదారులు ధర విషయంలో ఎక్కువ పట్టుదలగా ఉంటారని తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ వస్తే ఎక్కువశాతం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారని లీ ఎకో తన సర్వేలో తెలుసుకుంది. ఎక్కువ ధరలు ఉన్న యాపిల్, శాంసంగ్ ఫోన్ల కన్నా తక్కువ ధరలకు వస్తున్న కొత్త బ్రాండ్‌లను కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నేపథ్యంలో లీ ఎకోను విస్తరించాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఎల్ ఇ-2, ఎల్ ఈ2 ప్రొ, ఎల్ ఈ మాక్స్ 2 లాంటి బ్రాండ్‌లను వినియోగదారులకు చేరువ చేయాలనేది లీ ఎకో వ్యూహం. |