ఎయిర్ టెల్ 24.15 %, వొడా ఫోన్ 17.01 %, రిలయన్సు 9.94% బీఎస్సెన్నెల్ 8.2 % దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 101 కోట్లు దాటింది. 2015 చివరి నాటికే మొబైల్ వినియోగదారులు 100 కోట్లు దాటారు. కాగా అందులో 57.27 శాతం మంది అర్బన్ వినియోగదారులు. తాజాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయి ) దేశంలో మొబైల్ గణాంకాలు వెల్లడించింది. 2016 జనవరి 31 నాటికి దేశంలో మొత్తం 101.79 కోట్ల వినియోగదారులున్నారని ప్రకటించింది. మరోవైపు వైర్ లైన్ కనెక్షన్ల సంఖ్య మాత్రం భారీగా పడిపోయింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2.53 కోట్ల ల్యాండ్ లైన్ కనెక్షన్లే ఉన్నాయట. తాజా గణాంకాల ప్రకారం మొత్తం మొబైల్ వినియోగదారుల్లో 57.27 శాతం మంది పట్టణ వినియోగదారులు కాగా 42.73 శాతం మంది గ్రామీణ వినియోగదారులు. ల్యాండ్ లైన్ల విషయంలో ఈ వ్యత్యాసం భారీగా ఉంది. పట్టణాల్లో 82.56 శాతం.. గ్రామాల్లో 17.44 శాతం ల్యాండ్ లైన్ వినియోగదారులున్నారు. పట్టణాల్లో మొబైల్ టెలీ డెన్సిటీ గ్రామాల్లో కంటే మూడింతలు ఉంది. దేశంలో మొత్తం టెలి డెన్సిటీ 82.3 కాగా పట్టణాల్లో ఇది 147.72 గా ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల విషయానికొచ్చేసరికి 49.83 శాతం టెలి డెన్సిటీ మాత్రమే ఉంది. ల్యాండ్ లైన్ల విషయంలో ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువగా ఉంది. పట్టణాల్లో వైర్డ్ లైన్ టెలీ డెన్సిటీ 5.3 గా ఉండగా గ్రామాల్లో 0.51 ఉంది. అంటే గ్రామాల్లో కంటే పట్టణాల్లో పది రెట్లు ఎక్కువగా ఉందన్నమాట. టెలీ డెన్సిటీ పరంగా ఢిల్లీ టాప్ లో ఉండగా బీహార్ అట్టడుగున ఉంది. ఢిల్లీలో టెలీ డెన్సిటీ 240.64 కాగా బీహార్లో అది 52.66 మాత్రమే. దేశంలో సగటు టెలి డెన్సిటీ కంటే 11 రాష్టాల్లో ఎక్కువ ఉంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహా రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లలో ఈ పరిస్థితి ఉంది. మరోవైపు దేశంలో 101 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల కనెక్షన్లు తక్కువే. ప్రయివేటు సర్వీసు ప్రొవైడర్ల హవానే నడుస్తోంది. మొత్తం కనెక్షన్లలో 91.45 శాతం కనెక్షన్లు ప్రయివేటు ఆపరేటర్ల చేతిలోనే ఉన్నాయి. ప్రభుత్వం రంగ సంస్థలైన బీఎస్సెన్నెల్, ఎంటీఎన్నెల్ ల వాటా 8.55 శాతం కాగా భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 24.15 శాతం వాటా కలిగిఉంది. వొడా ఫోన్ వాటా 17.01 శాతం. రిలయన్సు వాటా 9.94 శాతం.. ఎయిర్ సెల్ 8.45.. బీఎస్సెన్నెల్ 8.2 శాతం మార్కెట్ షేర్ పొందాయి. ఇక బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులైతే 14 కోట్ల మంది ఉణ్నారట. ట్రాయి లెక్కల ప్రకారం 512 కేబీపీఎస్ స్పీడు కంటే ఎక్కువ వేగం ఉన్న నెట్ వినియోగాన్నే బ్రాడ్ బ్యాండ్ అంటారు. మొత్తం 14 కోట్ల మందిలో 1.663 కోట్ల మంది వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ వాడుతుంటే 12.29 కోట్ల మంది ఫోన్లు, డోంగిళ్ల సహాయంతో బ్రాడ్ బ్యాండ్ వినియోగిస్తున్నారు.బ్రాడ్ బ్యాండ్ లో బీఎస్సెన్నెల్ వాటా 14.3 శాతం కాగా... ప్రయివేటు సర్వీస్ ప్రొవైడర్ల వాటా 83.25 శాతం. అందులో అత్యధికంగా ఎయిర్ టెల్ 32.7 శాతం వాటా కలిగి ఉంది. వొడా ఫోన్ 26.24.. ఐడియా 22.04... రిలయన్సు 15.49 వాటా కలిగి ఉన్నాయి. |