ఆన్ లైన్ వేదికగా జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టాల చర్నాకోలా ఉపయోగిస్తోంది. నిబంధనలు కఠినతరం చేసి ఆన్ లైన్ అడ్డాగా సాగుతున్న విపరీత ధోరణులకు కళ్లెం వేయనుంది. ఇప్పటికే ఈ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో ముందడుగు వేసింది. ఇకపై పెళ్లిళ్ల వెబ్ సైట్లలో పేరు నమోదు చేసుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను తీసుకొస్తోంది. మాట్రిమోనియల్ వెబ్ సైట్లకు ఆన్ లైన్ అక్రమాలకు సంబంధం ఏంటన్న సందేహం వస్తుందా? అక్కడే ఉంది మెలిక. ఇటీవల కాలంలో కొందరు మేట్రిమోనియల్ వెబ్ సైట్ల ముసుగులో డేటింగ్, అశ్లీల చాటింగ్ వెబ్ సైట్లు నిర్వహిస్తున్నారు. నిజంగా వివాహం కోసం ప్రయత్నించేవారికి ఇలాంటి సైట్లు... వీటిలో ఉండేవారితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో కేంద్రం కొరఢా ఝుళిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ నూతన నిబంధనలు, మార్గదర్శకాలు సిద్ధం చేసింది. మాట్రిమోనియల్ సైట్లను దుర్వినియోగం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని... నిబంధనలు టైట్ చేస్తున్నామని మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకాగాంధీ ఈ విషయం ప్రకటించారు. దాని ప్రకారం ఇకపై ఇలాంటి సైట్లలో రిజిష్టర్ చేసుకునేవారికి ఖాతా యాక్టివేట్ చేయాలంటే వారి ప్రొఫైల్ పూర్తిగా పరిశీలించడంతో పాటు వారి చిరునామా, గుర్తింపు కార్డులను పూర్తిగా పరిశీలించి యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్, వోటర్ కార్డులు, లైసెన్సు, పాస్ పోర్టు వంటివి గుర్తింపు కార్డులుగా పనిచేస్తాయి. వారిచ్చిన చిరునామా, ఫోన్ నంబరు అసలైనవో కాదో వెరిఫై చేసుకోవాలి. ఇచ్చిన సమాచారం తప్పుగా ఉన్నా, దురుద్దేశాలు ఉన్నా ఆ ఖాతా రద్దు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా వెబ్ సైట్లు కూడా తమ సైట్ కేవలం వివాహ సంబంధాల కోసమేనని.... డేటింగ్ కోసం కాదని డిక్లరేషన్ ఇవ్వాలి. తాజా నిబంధనలతో ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న అశ్లీల కార్యకలపాలకు కొంతవరకు అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నారు. |