రాజస్థాన్‌లో ‘‘భామా షా డిజిటల్ పరివార్ యోజన’’ కింద ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కోటి స్మార్ట్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) పరిధిలో ‘భామా షా కార్డు’గల కోటి కుటుంబాలకు వీటిని అందజేస్తామని ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రకటించినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఈ పథకం కింద అర్హతగల ప్రతి కుటుంబానికి తొలివిడతగా రూ.500 వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఈ సొమ్ముతో వారు ప్రభుత్వం నడిపే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ శిబిరంలో ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటుపైన ఆ ఫోన్‌కు వారు ఇంటర్నెట్ కనెక్షన్ పొంది, ‘భామా షా యాప్’సహా ఇతర యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ అనంతరం రెండో విడతగా మరో రూ.500 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో వసుంధర రాజే ప్రభుత్వ పదవీకాలం 2019 జనవరిలో ముగియనుండగా వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు రానుండటం ఈ సందర్భంగా గమనార్హం.
ఇదీ భామా షా పథకం
రాష్ట్రంలో ‘‘ఆర్థిక సార్వజనీనత, మహిళా సాధికారత, సమర్థంగా సేవా ప్రదానం’’ లక్ష్యాలుగా భామా షా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనికిందకు వచ్చే ప్రతి కుటుంబానికీ ‘భామా షా కార్డు’ జారీ అవుతుంది. ఇది లబ్ధిదారు ఆధార్ గుర్తింపు ప్రాతిపదికగా వారి ప్రధాన బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకుల సరఫరా నుంచి ప్రత్యక్ష లబ్ధి బదిలీ (DBT) చెల్లింపులదాకా ఈ పథకం పరిధిలోనే ఉంటాయని దీనిపై విడుదల చేసిన కరదీపికలో ప్రభుత్వం ప్రకటించింది. ‘‘ఆధార్, దానితో అనుసంధానించిన బ్యాంకు ఖాతా లేకుండా భామా షా పథకంలో నమోదు వీలుకాదు. ఆధార్ పొంది ఉండకపోతే ముందుగా దానికోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గుర్తింపు ప్రాతిపదికగానే భామా షా పథకంలో నమోదు సాధ్యం’’ అని ప్రభుత్వం సదరు కరదీపికలో స్పష్టం చేసింది. ఇక ‘భామా షా’ కార్యక్రమం కింద ఎస్ (Yes) బ్యాంకు భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం గతవారంమే ఒక డిజిటల్ వాలెట్‌ను ప్రారంభించింది. ఈ వాలెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న లబ్ధిదారులకు QR కోడ్‌తోనూ చెల్లింపులకు వీలవుతుంది. అయితే, ఈ యాప్ UPIని సపోర్ట్ చేసేదీ/లేనిదీ తెలియదు.