మోడీ అంటే టెక్నో పీఎంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొచ్చేసింది. ఇండియాలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయని రీతిలో టెక్నాలజీని ఫుల్లుగా వాడుకుంటున్నారాయన. అధికారంలోకి రావడానికి ముందు, ఆ తరువాత కూడా మోడీ టెక్నాలజీ వాడకం మామూలుగా లేదు. కానీ... అదే మోడీ, భారత్ లోని ఉద్యోగులకు మాత్రం టెక్నాలజీకి దూరంగా ఉండమని చెబుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర సరకుగా మారిపోయిన స్మార్టు ఫోన్లకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఆసక్తికరంగా ఉన్న మోడీ సూచన వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్లకు దూరం కావాలని నరేంద్ర మోదీ సర్కారు సూచిస్తోంది. ఫోన్ల హ్యాకింగ్, డేటా దొంగతనం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా స్మార్టుఫోన్ల వాడకాన్ని తగ్గించాలని, ముఖ్యమైన ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించి ఈ తరహా ఫోన్లలో చర్చలు జరపొద్దని ఆదేశాలు అందాయట. అంతేకాదు... రీసెంటుగా జరిగిన సైబర్ సెక్యూరిటీ సదస్సులోనూ హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు వెలువరించింది. పారామిలటరీ విభాగంలో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా తొలగించాలని... వాటి స్థానంలో ల్యాండ్ లైన్లు సలహా ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా అధికారిక పనులు జరపడంతో విద్రోహులకు, హ్యాకర్లకు సులువుగా సమాచారం బట్వాడా అవుతోందని, దీనిపై మరింత చర్చ జరిపి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖ అంటోంది. హోం శాఖతో పాటు రక్షణ, విదేశీ వ్యవహారాలు తదితర శాఖల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నిలిపేస్తేనే మంచిదని, దీంతో చైనా, పాక్ హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ఆదేశాలు అందుతాయని సమాచారం. ఇదంతా చూస్తుంటే మోడీ హ్యాకింగుకు, హ్యాకర్లకు తెగ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా దేశాలకు మనలాంటి ముప్పే ఉన్నప్పటికీ అవి బలమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇండియాలో అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేకపోగా ఇలా స్మార్టు ఫోన్లపై నిషేధం విధించాలని మోడీ అనుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. |