• తాజా వార్తలు

ఇక స్మార్టు ఫోన్ల రాజ్యమే

2014-15 లో 10 కోట్లు,2015-16 లో 16 కోట్ల ఫోన్ల అమ్మకంగా అంచనా

78% పది వేల లోపు ధర ఉన్న ఫోన్లు

దేశీయంగా స్మార్టు ఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకుంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటి విక్రయాలు 16 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని  అసోచామ్ అంచనావేస్తోంది.  గడిచిన ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల విక్రయాలు జరిగాయి. చౌక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు మరింతగా స్పీడందుకున్నాయని అసోచామ్ వెల్లడించింది. 2012-13లో అమ్ముడైన 4.4 కోట్ల స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను రెండు రెట్లు పెరిగి 10 కోట్లకు చేరుకున్నాయి.

ఇక ఎలాంటివి కొంటున్నారన్నది పరిశీలిస్తే... అత్యుత్తమ కెమెరా పనితీరు, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన ఫోన్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నట్లు అసోచామ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది వినియోగదారులు ఫోటోలు, వీడియోలను తమ స్నేహితులతో పంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే స్మార్ట్‌ఫోన్లపై భారతీయులు మక్కువ చూపిస్తున్నారని, అత్యధికమంది యువత ఫోటోలను ఆన్‌లైన్‌లో షేరింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతైన వెచ్చించడానికి యువత వెనుకాడటం లేదు. మెరుగైన పనితీరు కనబరిచే కెమెరాలు కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో డిజిటల్ కెమెరాలు కనుమరుగవుతున్నాయి.  గడిచిన ఏడాదికాలంలో డిజిటల్ కెమేరాలు అమ్మకాలు 35 శాతం క్షీణించినట్లు అసోచాం పేర్కొంది. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో రూ.4 వేల నుంచి రూ.10 వేల లోపు ధర కలిగిన ఫోన్ల వాటా 78 శాతానికి పైగా ఉంటుందని అంచనా. పదివేలలోపు కలిగిన ఫోన్లలో అన్ని రకాల ఫీచర్సు  ఉన్నవాటివైపు 95 శాతం భారతీయులు మొగ్గుచూపతున్నారని తెలిపింది. దీంట్లో అత్యధికమంది కెమెరా పనితీరుకే మొగ్గుచూపారు. మొబైళ్లు, ట్యాబ్లెట్ల విక్రయాల్లో మెట్రో, ద్వితీయ శ్రేణి నగరాల వాటా 75 శాతంగా ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మొగ్గుచూపే వారు అధికమవుతున్నారని, అలాగే పర్సనల్ కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. స్మార్టుఫోన్లు, ట్యాబ్లెట్లలో నెట్‌వారే సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని అసోచామ్ తేల్చింది.

 

జన రంజకమైన వార్తలు