• తాజా వార్తలు

కాల్ డ్రాప్ లను మాయ చేయడానికి కొత్త టెక్నాలజీ వాడుతున్న టెలీకాం కంపెనీలు

మీరు మీ మొబైల్లో ఏ నెట్ వర్క్ వాడుతున్నా సిగ్నల్ సరిగ్గా రాకపోవడం, మధ్యలో  కాల్ డ్రాప్ కావడం సహజమైపోయింది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లోనే ఈ దుస్థితి తప్పడం లేదు. దీనికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అనేక కారణాలు చెబుతున్నా వినియోగదారులకు అసౌకర్యం కలిగించడానికి ట్రాయ్ ఒప్పుకోవడం లేదని మనకు తెలిసిందే.

కాల్ డ్రాప్‌లకు పెనాల్టీ చెల్లించాలనీ, డ్రాపైన ప్రతికాల్‌కీ ఒక రూపాయి వినియోగదారుడి తిరిగి చెల్లించాలనీ కూడా ఈ మధ్య ఆదేశాలు వెలువడ్డాయి. దాని మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది కూడా.

ఆర్థికంగానూ, గుడ్‌విల్‌ పరంగానూ తలనొప్పిగా మారిన  ఈ సమస్యను పరిష్కరించేందుకు టెలికాం కంపెనీలు అడ్డతోవలు అన్వేషించడం మొదలు పెట్టాయి. మీకు సిగ్నల్ అందక పోయినా కనెక్ట్ అయి ఉన్నట్లే చూపించే కొత్త టెక్నాలజీని ఆశ్రయిస్తున్నాయి.

సాధారణంగా సిగ్నల్ అందక పోతే కాల్ దానంతట అదే కట్ అయిపోతుంది. అలా మీరు కట్ చేయకుండా దానంతట అదే కట్ అయిన కాల్స్ "కాల్ డ్రాప్" కిందకు వస్తాయి. అంటే వాటికి టెలికాం కంపెనీలు పెనాల్టీ చెల్లించాలన్నమాట. ఇప్పుడు కంపెనీలు వాడుతున్న కొత్త టెక్నాలజీ వల్ల మీ ఫోన్‌కు సిగ్నల్ అందకపోయినా, కాల్ కనెక్ట్ అయి ఉన్నట్లే ఫోన్లో కనబడుతుంది. అవతలివారి మాటలు మీకు వినబడవు. కొద్ది సెకన్లు ప్రయత్నం చేసి, విసుగెత్తిన మీరు మీ చేత్తోనే కాల్ కట్ చేస్తారు. అప్పుడు అది టెక్నికల్‌గా కాల్ డ్రాప్ కిందకు రాదు. ఒకవేళ మీరు మొండిగా కాల్ మాట్లాడదామని ప్రయత్నం చేస్తే కొద్ది సెకన్ల తర్వాత కాల్ కలిసే అవకాశం ఉంది. అయితే మీకు సిగ్నల్ లేని సమయం, అంటే అవతలి మాటలు వినబడని సమయానికి కూడా మొత్తం బిల్లు పడిపోతుంది.

అయితే ఈ టెక్నాలజీ అనేది, పెనాల్టీల నుంచి తప్పించుకొనేందుకు వాడే తాత్కాలిక రక్షణ మాత్రమే అనేది టెలికాం, మార్కెట్ నిపుణుల మాట. ఎందుకంటే నెట్‍వర్క్ ఎక్కువగా ఇబ్బంది పెడితే వచ్చే చెడ్డపేరు, దీర్ఘకాలంలో వినియోగదారుల విశ్వసనీయత కోల్పోయేలా చేస్తుంది. అసలుకే మోసం వస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని కంపెనీల విషయంలో రుజువయ్యింది కదా!

 

జన రంజకమైన వార్తలు