ఆధార్ ను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వ్యాపార సంస్థలకు ఆధార్ సంస్థ యుఐడిఎఐ షాక్ ఇచ్చింది. ఆధార్ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వినియోగదారుడి ధృవీకరణ కోసం రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే సంస్థలు నిర్వహించే ప్రతి లావాదేవి దృవీకరణరు 50 పైసలు చెల్లించాలని యుఐడిఎఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆధార్ ధృవీకరణ కోసం వ్యాపార సంస్థలు ప్రతి ఇ-కెవైసి లావాదేవీకి రూ.20 (పన్నులతో సహా) చెల్లించాలని, ఆధార్ ప్రమాణీకరణ కోసం 50 పైసలు (పన్నులతో) చెల్లించాలని యుఐడిఎఐ నోటిఫికేషన్‌లో తెలిపింది.
ఆధార్ రెగ్యులేషన్స్ 2019 ప్రకారం, ప్రభుత్వ సంస్థలకు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లకు లావాదేవీ చార్జీలలో మినహాయింపు ఇచ్చారు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఆథెంటికేషన్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్ నమోదు, అప్‌డేట్ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది.
మిగిలిన అన్ని ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలు ఇక ఆధార్ ప్రామానిక సేవలు పొందుతున్నందుకు లావాదేవీల రుసుములు చెల్లించాల్సిందే. సంబంధిత ఇన్వాయిస్ జారీచేసిన 15 రోజుల్లోని ఈ చెల్లింపులను ఆయా సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.15 రోజులు దాటితే నెలకు 1.5 శాతం వడ్డీ విధించడంతో పాటు ఇ-కెవైసి సేవలను నిలిపివేస్తామని యుఐడిఎఐ హెచ్చరించింది.
ఇప్పటికే ఆధార్ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్ ఆథెంటికేషన్ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది.
ఇకెవైసి వినియోగానికి సంస్థలు ఎక్కువగా ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. యుఐడిఎఐ తాజా నిర్ణయంతో ఇ కెవైసి వినియోగించుకునే సంస్థలపై భారం పడనుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు తీసుకోలేదని, ఇప్పుడు విధించినది నామమాత్రమేనని ఆధార్ సంస్థ పేర్కొంది.
ఆధార్ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150–200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఇంటింటికీ తిరిగి వ్యయప్రయాసలకు గురవుతున్నామని సంస్థలు మొరపెట్టుకున్నాయి.
అధికారికంగా ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, కేవైసీ సేవలు పొందుతామని ఎంతోకాలంగా డిమాండు చేస్తున్నాయి. దీనివల్ల తమతోపాటు వినియోగదారులకూ సౌలభ్యమని వాదిస్తున్నాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి.