రైల్వేశాఖలో అత్యంత కీలకమైన విభాగాన్ని తాము సమర్థంగా నిర్వహించలేకపోతున్నామని ఆ శాఖ అధికారులు బలంగా నమ్ముతున్నారా? లాభాలు ఆర్జించడం కోసం దేశంలోని ఎన్నో కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసేందుకు సిద్ధమవుతున్నారా? రైల్వేకి ఆయువు పట్టులా ఉన్న ఐఆర్‌సీటీసీ నిర్వహణ బాధ్యతలను రైల్వేశాఖ ఇక మోయలేకపోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే ప్రజా డేటాని ప్రైవేట్‌పరం చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన చర్యలు శరవేగంగా జరిగిపోతున్నాయి.
కోట్ల మంది వ్యక్తిగత సమాచారం..
దేశంలో ఉన్న ఈ కామర్స్ పోర్టల్స్‌లో ఐఆర్‌సీటీసీ ఎంతో పెద్దది. నెలకు సుమారు 1.2 కోట్ల టికెట్లు దీని ద్వారా బుక్ అవుతాయి. 3 కోట్ల మంది రిజిస్టర్ యూజర్లు, నెలకి 6 కోట్ల సార్లు దీనిలో లాగిన్ అవుతారు. రోజుకి సుమారు 20 లక్షల మంది లాగిన్ అవుతారు. 7 లక్షల టికెట్లను రోజుకి ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. దీంతో పాటు యూజర్ల పేరు, వయసు, ఫోన్ నంబర్, ఆదాయం, ఫిజికల్ డిజేబులిటీస్, ఇతర కోటా వంటి వివరాలన్నీ కలుపుకొంటే ఏడాదికి 100 టెరాబైట్ల(లక్ష జీబీ) డేటా ఉంటుంది. ప్రస్తుతం ఇంతటి అతి ముఖ్యమైన సమాచారాన్ని.. వేలంలో తమకు ఎక్కువ ధర ఇచ్చే థర్డ్ పార్టీలకు అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గోయల్ గత నెలలోనే చెప్పినా..
రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్.. గత ఏడాది ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద డేటా క్రియేటర్లలో ఐఆర్‌సీటీసీ ఒకటని, ఇండియన్ రైల్వేస్ ద్వారా ఏటా 100 టెరాబైట్ల సమాచారం ఏటా సేకరిస్తున్నామన్నారు. దీనిని ఒక తెలివైన, సక్రమమైన పద్ధతిలో నిర్వహించాల్సి ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. ఐఆర్‌సీటీసీలో పెట్టుబడుల ఉపసంహరణల దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే డేటా ప్రైవేటైజేషన్‌ను తీసుకొస్తున్నట్లు వివరించారు. అయితే ఇతర సమస్యలు ఫోకస్‌లోకి రావడంతో.. ఐఆర్‌సీటీసీ అంశం మరుగున పడిపోయింది. ఒక క్రమ పద్ధతిలోకి వచ్చే వరకూ డేటాతో ఉపయోగం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు.
చర్చలు ప్రారంభం
ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన టెలీకం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కూడా దీనిని వదిలేసింది. పబ్లిక్ డేటా వినియోగించే కొన్ని ప్రైవేటు కంపెనీలకు కొన్ని సిఫార్సులు చేసింది. ప్రజల సమాచార నిర్వహణ బాధ్యతలను వేరొకరికి ఇచ్చే కంటే ప్రభుత్వమే సమర్థంగా వాటిని ఎలా నిర్వహించాలి, అందుకు ఏఏ అంశాల్లో కీలక మార్పులు చేయాలనే అంశాలపై మాత్రం స్తబ్దుగా వ్యవహరిస్తోంది. రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ డేటా ప్రైవేటైజేషన్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓలా, ఉబర్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంపై అధికారులు చర్చిస్తున్నారు.
చట్టాలు ఏం చెబుతున్నాయి?
తన వివరాలను వేరొకరికి అమ్ముకుంటారనే ఆలోచన లేకుండానే ప్రయాణికులు తమ వివరాలను రైల్వేశాఖకు ఇస్తారు. ప్రస్తుతం ఈ డేటాకి రైల్వేస్.. ఒక కస్టోడియన్(సంరక్షకుడిగా)లా ఉంటూ.. థర్డ్ పార్టీలకు అందజేస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్, సైంటిస్ట్ వసంత్ ధార్ అభిప్రాయపడ్డారు. అయితే ఐటీ సెక్యూరిటీ యాక్ట్-2000 ప్రకారం..ఆరోగ్యం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్స్, ఇతర సమాచారాన్ని.. భద్రపరచాలన్నా, ఇతరులకు ఇవ్వాలన్నా, విక్రయించాలన్నా యూజర్ల అనుమతితో మాత్రమే చేయాలి. వీటిని అతిక్రమించిన వారెవరినైనా, అది ప్రభుత్వమైనా.. కోర్టు ముందు నిలబెట్టే అధికారం యూజర్లకు ఉంది.
గతంలో డేటా చౌర్యం ఘటనలు..
2016లో దేశంలో భారీ స్థాయిలో సమాచార చౌర్యం జరిగింది. అది కూడా ఐఆర్‌సీటీసీకి చెందినదే! ఈ డేటాబేస్ లీక్ అయి కోటి మంది ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీ అయ్యాయి. ఈ వివరాలను చాలా మంది సీడీలు చేసి.. రూ.15వేలకు కూడా అమ్ముకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరుతో రూపొందించిన `నమో` యాప్‌లో నమోదైన వారి వివరాలు.. ఇతర దేశానికి ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని ప్రభుత్వ సంస్థలు తీవ్రంగా ఖండించినా.. తర్వాత ఈ కేసు విచారణను ఇప్పుడు పక్కన పెట్టేశాయి. వీటితో పాటు గత మేలో.. పేటీఎం కూడా తమ యూజర్ల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా పీఎంవోకు అందజేసిందనే విమర్శలు వినిపించాయి. దీనిపైనా సరైన స్పష్టత లేకుండానే కేసు పక్కన పెట్టేశారు.