• తాజా వార్తలు

ప్రివ్యూ- బీఎస్ఎన్ఎల్ వారి నుండి తొలి ఎంవీఎన్‌వో స‌ర్వీస్‌

అర్బ‌న్ సెక్ష‌న్‌లో మిగిలిన మొబైల్ నెట్‌వ‌ర్క్‌ల‌న్నింటినీ ఓ ఆటాడిస్తున్న రిల‌య‌న్స్ జియో ఇప్పుడు తాజాగా రూర‌ల్ ఏరియాల మీద దృష్టి పెట్టింది.  జియో ఫోన్ ఆఫ‌ర్ల‌తోపాటు వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో గ్రామీణ ప్రాంత మొబైల్ వినియోగ‌దార్ల‌ను త‌న వైపుకు తిప్పుకోవాల‌ని చూస్తోంది. ఈ విష‌యంలో జియో స‌క్సెస్ అయితే ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉనికికే ప్ర‌మాదం. అందుకే బీఎస్ఎన్ఎల్ వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైంది. జియోతో పోటీప‌డి గెల‌వ‌డానికి ఇండియాలోనే  తొలిసారిగా మొబైల్ వ‌ర్చ్యువ‌ల్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ (MVNO) స‌ర్వీస్‌ల‌ను రంగంలోకి తెచ్చింది. అస‌లేంటి ఈ  MVNO service?  దాంతో యూజ‌ర్ల‌కు ఏంటి ఉప‌యోగం చూద్దాం ప‌దండి.

ఎంవీఎన్‌వో స‌ర్వీస్ అంటే 
మొబైల్ వ‌ర్చ్యువ‌ల్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ స‌ర్వీస్ అంటే ఒక సంస్థ అక్క‌డ వేరే కంపెనీకి చెందిన మౌలిక స‌దుపాయాల‌ను అద్దె ప్రాతిప‌దిక‌న తీసుకుంటుంది. దానితో స‌ర్వీసుల‌ను రన్ చేసి వేరే కంపెనీల‌కు వాటిని అందిస్తుంది. ఇందుకోసం ఆ కంపెనీల నుంచి అద్దె వ‌సూలు చేస్తుంది. ఇలా బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఏరోవోయిస్ (Aerovoyce) ప్లింట్రోన్ (Plintron) అనే రెండు కంపెనీల‌తో టై అప్ పెట్టుకుంది. ఏరోవోయిస్ ఎంవీఎన్‌వో స‌ర్వీసుల‌కు లైసైన్స్ క‌లిగి ఉన్న కంపెనీ. చెన్నై నుంచి  ప‌ని చేస్తుంది. ఇక ప్లింట్రోన్ మొబిలిటీ స‌ర్వీస్‌లు ప్రొవైడ్ చేయ‌డంలో స్పెష‌లైజేష‌న్ క‌లిగిన మ‌ల్టినేష‌న్ కంపెనీ. బీఎస్ఎన్ఎల్‌కు ఇప్ప‌టికే గ్రామీణ ప్రాంతాల్లో అద్భుత‌మైన మౌలిక స‌దుపాయాలున్నాయి. ట‌వ‌ర్లు, లైన్ల విష‌యంలో గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్‌ను కొట్ట‌గ‌లిగిన కంపెనీ లేదు.  బీఎస్ఎన్ఎల్‌కు ఉన్న ఈ సౌక‌ర్యాలను ఉప‌యోగించుకుని ఇప్ప‌టికీ బీఎస్ఎన్ఎల్ స‌ర్వీసులు డ‌ల్‌గా ఉన్న గ్రామాల్లో మంచి క‌నెక్టివిటీతో కాల్స్‌, డేటాను అందించడం ఈ ఒప్పందం ల‌క్ష్యం.

టారిఫ్ కారుచౌక‌
ఈ  ఎంవీఎన్‌వో స‌ర్వీస్‌తో బీఎస్ఎన్ఎల్ 29, 79 రూపాయ‌ల చౌక ధ‌ర‌ల్లో రెండు ప్లాన్స్‌ను లాంచ్ చేసింది.  

* 29 రూపాయ‌ల ప్లాన్‌లో ఏరోవోయిస్ యూజ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంది.

* 79 రూపాయ‌ల ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌తోపాటు రోజుకు 2జీబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది. 

* ఈ రెండు ప్లాన్స్ వ్యాలిడిటీ నెల రోజులు.

ఇంత చౌక ప్లాన్స్‌ను ఇండియాలో ఏ నెట్‌వ‌ర్క్ అందించ‌డం లేదు. కాబ‌ట్టి గ్రామీణ ప్రాంతాల్లో త‌న ప‌ట్టును నిల‌బెట్టుకోగ‌లమ‌ని బీఎస్ఎన్ఎల్ ఆశిస్తోంది.  వ‌చ్చే ఏడాది కాలంలో ఈ ఎంఎన్‌వో స‌ర్వీసుల‌మీదే 600 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. త‌మ  దృష్టి గ్రామీణ ప్రాంతాలు ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాల‌మీదే పెట్టామ‌ని, అక్క‌డ ఈ ప్లాన్స్ స‌క్సెస్ అవుతాయ‌ని భావిస్తున్నామ‌ని  ఏరోవోయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శివ‌కుమార్ కుప్పుస్వామి చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఈ ఆశ అన్నా తీరుతుందేమో చూడాలి మ‌రి.
 

జన రంజకమైన వార్తలు