ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే అన్నీ ఇంటికొచ్చేస్తున్నాయి.. అలాగే లిక్కర్ కూడా హోమ్ డెలివరీ పెట్టేస్తే భలే ఉంటుంది మామా .. డ్రింకింగ్ అలవాటున్నవారిలో చాలా మంది ఇప్పుడు ఇలాగే కోరుకుంటున్నారు. వైన్ షాపుకెళ్లి కొనుక్కోవాలంటే టైం సెట్ అవ్వకపోవచ్చు. బార్‌కి వెళ్లాలంటే ఎవరైనా తెలిసినవాళ్లు చూస్తారేమోనన్న సందేహం. పోనీ అదీ కాదనుకుంటే డ్రంకెన్ డ్రైవ్ భయం. అందుకే ఇప్పుడు చాలామంది మద్యం ప్రియులు బార్ కంటే ఇల్లే పదిలం అంటున్నారు. ఇలాంటి వారికి ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే ఇంటికే లిక్కర్ సప్లయి చేసేందుకు ఓ యాప్ కూడా వచ్చేసింది. ఆ యాప్ విశేషాలేమిటో చూద్దాం
చెన్నై, బెంగళూరు, గోవాల్లో సర్వీస్
హిప్‌బార్ అనే పేరుతో ఇండియాలో తొలి లిక్కర్ డెలివరీ యాప్‌ను ప్రసన్న నటరాజన్ అనే వ్యక్తి 2015లోనే ప్రారంభించారు. దీనికి ఆర్బీఐ అనుమతి పొందిన మొబైల్ వాలెట్ కూడా ఉంది.
* హిప్‌బార్ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావాల్సిన లిక్కర్‌ను ఆర్డర్ ఇచ్చి ఇంటికే తెప్పించుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న వైన్ షాప్‌కి వెళ్లి తెచ్చుకోవచ్చు కూడా.
* హిప్‌బార్ ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, గోవాల్లో సర్వీసులు అందజేస్తోంది.
త్వరలో మరిన్ని సిటీలకు
బెంగళూరుకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) రీసెంట్‌గా హిప్‌బార్‌లో 26% వాటాను కొనుక్కొంది. ఇందుకోసం 27 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దీంతో హిప్‌బార్ మరిన్ని నగరాలకు తన ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ సర్వీసులను విస్తరించనుంది.