దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తన సేవలను మరింత విస్తరించబోతోంది. రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను జూలై 5 నుంచి ప్రవేశపెట్టేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమవుతున్నారు. ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్‌టీటీహెచ్) పేరుతో ఈ సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ సంస్థల మధ్య టెలికాం వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రాకతో ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
ఇవీ స్పెషాలిటీస్
1. పెద్దపెద్ద నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ 100ఎంబీపీఎస్ కన్నా తక్కువగానే ఉంటుంది. నెలకి 500 జీబీ వరకూ మాత్రమే డేటాను అందజేస్తున్నాయి. రిలయన్స్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు 100 ఎంబీపీఎస్‌తో రాబోతున్నాయి. అది కూడా అపరిమితమైన డేటా వినియోగంతో!
2. అపరిమితమైన వీడియో, కాల్స్ కూడా చేసుకునే సదుపాయం వినియోగదారులకు అందించబోతోంది.
3. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే కంపెనీలు భారీగానే ఛార్జ్ చేస్తున్నాయి. జియో ఫైబర్‌లో రూ.1000 నుంచి రూ.1500 మాత్రమే చెల్లించి ఉచిత వీడియో, నార్మల్ కాల్స్‌ను వాడుకోవచ్చు.
జియో ఫోన్ స్కీమ్ ఇక్కడ కూడా
డిపాజిట్‌గా కొంత చెల్లించి ఉచితంగా జియో మొబైల్ ఫోన్ అందించి వినియోగదారులను ఆకర్షించిన రిలయన్స్ ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు ఫాలో అవబోతోంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఉచిత బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ సేవల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం జియో అతి తక్కువ ధరలకే అన్‌లిమిటెడ్ డేటా వినియోగంతో ఈ సేవలను ప్రవేశపెడుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎయిర్‌టెల్‌కు కష్టమే
మొబైల్ నెట్‌వర్క్‌లో జియో దెబ్బతో బాగా ఎఫెక్ట్ అయింది. మార్చితో ముగిసిన మొదటి ఆర్థిక త్రైమాసికంలో ఏకంగా రూ.604 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ సెక్టార్‌లోనూ ఇదే హీట్‌ను ఫేస్ చేయబోతోంది. జియో ఫైబర్‌తో తన వినియోగదారులు చేజారిపోకుండా ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. సుమారు 15-20 శాతం ధరలు తగ్గించి ఆరునెలలు, సంవత్సర ప్యాకేజీలు ప్రవేశపెట్టింది. అది కూడా 300 ఎంపీబీఎస్ వేగంతో కావడం విశేషం. అంతేకాదు డీటీహెచ్‌తో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు కలిపి ఒకే సర్వీసుగా ఎయిర్‌టెల్ అందించే అవకాశాలున్నాయి.