ఫుడ్ డెలివరీ, ఈకామర్స్, కొరియర్ డెలివరీ బాయ్స్ ప్రొడక్ట్స్ డెలివరీ కోసం మీరుండే గేటెడ్ కమ్యూనిటీకో లేదా అపార్ట్‌మెంట్‌కో రావడం ఈరోజుల్లో చాలా సాధారణ విషయం. అయితే దొంగల భయం పెరిగేకొద్దీ ఎవరిని లోపలికి పంపాలన్నా ఒకటికి 10సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మై గేట్ అనే ఓ యాప్‌ను తయారుచేసింది ఓ స్టార్టప్ కంపెనీ. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఈ యాప్ ఓ విధ్వంసక ఆవిష్కరణ అని చెప్పొచ్చు. ఈ యాప్ ద్వారా మీరు అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అలర్ట్ చేసి మీరు పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిని మాత్రమే లోపలికి పంపించమని చెప్పొచ్చు. డెలివరీ పర్సన్‌కి మై గేట్ యాప్ నుంచి ఒక ఓటీపి వెళుతుంది. ఆ ఓటీపీ నెంబర్‌ను చెబితేనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను లోపలికి పంపిస్తారు. లేదంటే ఇంటర్‌కామ్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది. దాని ద్వారా మీకు కాల్ వస్తుంది. మీరు పంపమంటేనే లోపలికి పంపిస్తారు.
డిజిటలైజేషన్‌తో ఈజీ
ఇంతకు ముందు ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్‌గా జరిగేది. డెలివరీ బాయ్‌కు మనకు కాల్ చేస్తే మనం సెక్యూరిటీకి ఫోన్ చేసి చెప్పేవాళ్లం. ఈ యాప్‌తో అదంతా డిజిటలైజేషన్ అయింది.
* ఓటీపీ బేస్డ్ కావడంతో దాన్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తి వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి ఆ ఓటీపీ నెంబర్ చెబుతాడు. అప్పటికే మై గేట్ యాప్‌తో కనెక్ట్ అయి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా సిబ్బందికి ఆ ఓటీపీ నెంబర్ వెళుతుంది. డెలివరీ బాయ్ చెప్పిన ఓటీపీ కరెక్ట్‌గా మ్యాచ్ అయితేనే వాళ్లు లోపలికి పంపిస్తారు. కాబట్టి డెలివరీ పేరు చెప్పి ఎవరుపడితే వాళ్లు లోపలికి వస్తున్నారన్న భయం ఉండదు.
* ఈ యాప్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. తర్వాత ప్రతిదీ డిజటలైజ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది.
* అయితే ఇందుకోసం సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ యాప్‌ను ఉపయోగించగల పరిజ్ఞానం తెలిసున్న వాళ్లయి ఉండాలి.
పిల్లలకూ సెక్యూరిటీ
ఏదైనా పనిమీద బయటికి వెళుతూ పిల్లలను ఇంట్లో వదిలివెళుతుంటే వాళ్లు అపార్ట్‌మెంట్ దాటి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
1,80,000 ఇళ్లకు భద్రత
బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ ప్రస్తుతం బెంగళూరులోని 1,80,000 ఇళ్లకు మై గేట్ యాప్ ద్వారా ఈ సర్వీస్ అందిస్తోంది. త్వరలో ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, పుణెలకూ మై గేట్ యాప్ సర్వీసులను కంపెనీ అందుబాటులోకి తేబోతోంది. కామన్‌ఫ్లోర్, అపార్ట్‌మెంట్ అడ్డా వంటి కంపెనీలు కూడా ఇలాంటి సర్వీసులను తీసుకొచ్చాయి. అయితే ఇప్పటికే మై గేట్ యాప్ ఈ విషయంలో ముందడుగు వేసింది.