యాపిల్ కంపెనీ కొత్త తరం ఐఫోన్‌ను విడుదల చేసినప్పుడల్లా నెట్‌వర్క్ ఆపరేటర్లకు పండగే! ప్రతిసారి ఈ ఫోన్లలో గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూసేందుకు, టన్నులకొద్దీ డేటా డౌన్‌లోడ్‌కు సరికొత్త సౌకర్యాలుండటం సహజం. అంటే- ఎంత ఎక్కువ డేటా అయితే... అంత భారీగా బిల్లులు రాబట్టుకోవచ్చన్న మాట... నెట్‌వర్క్ ప్రొవైడర్లకు ఆనందం కలిగించే అంశమిదే! కానీ, ఈసారి మాత్రం ఆపరేటర్లకు ఆనందం బదులు ఆవేదన కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఏటా సెప్టెంబరులో కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టే యాపిల్ అందులో భాగంగా బుధవారం (12.09.18) రాత్రి 10:30 గంటలకు సరికొత్త వాచ్, ఫోన్లను విడుదల చేసింది. అయితే, వాటితోపాటు చిరకాలం నుంచీ వినిపిస్తున్న eSIMలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు iPhone X(S), iPhone X(R)లతోపాటు Apple Watch S4ను ప్రపంచానికి పరిచయం చేసింది. సంస్థ ప్రాంగణంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో సంస్థ సహ వ్యవస్థాపకుడు టిమ్ కుక్ సహా పలువురు నిపుణులు ఈ ఉత్పత్తుల విశిష్టతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ ఉత్పత్తుల పరిచయం యాపిల్ అభిమానులకు ఆనందం కలిగించినా టెలికాం ఆపరేటర్లకు మాత్రం ఒకింత కలవరం కలిగించిందనే చెప్పాలి. యాపిల్ ఎప్పట్నుంచో చెబుతున్న eSIMలను కొత్త ఉత్పత్తులలో వినియోగించడమే అందుకు కారణం.
eSIMవల్ల ఆపరేటర్లకు నష్టమేమిటి?
ఇప్పటి పద్ధతి ప్రకారం మనం ఆపరేటర్‌ను మార్చాలంటే ముందుగా పోర్టబిలిటీ కోసం అభ్యర్థన పంపాలి. ప్రస్తుత-భవిష్యత్ ఆపరేటర్ల మధ్య అంగీకారం కుదిరితే.. అదీ ఒక వారం లేదా 10 రోజుల తర్వాత మాత్రమే మార్పు సాధ్యం. ఈలోగా దుకాణానికెళ్లి కొత్త సిమ్ తెచ్చుకుని, యాక్టివేషన్ కోసం ఎదురుచూడాలి. అయితే, eSIMతో ఈ బాధలన్నీ తప్పిపోతాయి. ఆపరేటర్‌ను మార్చాలంటే మన ఫోన్‌లో సెట్టింగ్స్‌ను మార్చుకుంటే సరిపోతుంది. ఇది ఆపరేటర్లతో వినియోగదారుల బేరసారాలకు మంచి అవకాశం అవుతుంది కాబట్టి కంపెనీల మధ్య ధరల యుద్ధం ముదురుతుంది. యాపిల్ కంపెనీ eSIMను ఇప్పటికే కొన్ని iPads, Apple Watchలలో వినియోగించింది. ఇప్పుడు తాజాగా iPhone X(S), iPhone X(R), Apple Watch S4లకు eSIM సదుపాయం కల్పించింది. వీటిద్వారా తమ సేవలు అందించేందుకు భారతదేశంతోపాటు పలు దేశాల టెలికాం ఆపరేటర్లు అంగీకరించారు. అయితే, ఒక్క చైనాలో మాత్రమే భౌతిక సిమ్ కార్డుల వినియోగం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త వాడకందారులను ఆకట్టుకునే మాట అటుంచి మార్కెట్‌లో వాటా పెంచుకునే దిశగా కొత్త మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రత్యర్థులతో భీకర పెట్టుబడుల యుద్ధం తప్పదన్న ఆందోళన ఆపరేటర్లలో వ్యక్తమవుతోంది.
అసలు ఎలక్ట్రానిక్ సిమ్ (eSIM) అంటే...
నేడు మనం వాడుతున్న సిమ్ కార్డును మొబైల్ ఫోన్‌లో దానికి నిర్దేశించిన స్లాట్‌లో ఇముడుస్తాం. కానీ, eSIM అన్నది ప్రస్తుత నానోకార్డుకన్నా చిన్నదిగా ఓ బుల్లి చిప్ రూపంలో ఏకంగా ఫోన్ మదర్ బోర్డులో భాగంగా ఉంటుంది. దీన్ని మార్చడం లేదా తీయడం అసాధ్యం. ఇందులో వివిధ నెట్‌వర్క్‌ల ప్రొఫైళ్లను నిల్వచేయవచ్చు. తద్వారా మనం ఉన్నచోటనే ఒక నెట్‌వర్క్ నుంచి మరొకదానికి మారడం చిటికలో పని! అంతేకాదు... విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నెట్‌వర్క్‌కు మారడం కూడా చాలా సులువైపోతుంది. ఇప్పటికే విదేశాల్లో GigSky వంటి కంపెనీలు సదరు సేవలను అందిస్తున్నాయి.
eSIMలను ఏయే ఉత్పత్తుల్లో వాడుతున్నారు?
ప్రస్తుతం eSIMలను వాడుతున్న పరికరాలు పెద్ద సంఖ్యలో లేవుగానీ- యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తాము తయారుచేసే కొన్ని ఉత్పత్తులలో వీటిని వినియోగిస్తున్నాయి. యాపిల్ సంస్థ తన Series 3 Apple Watchలలో దీన్ని అమర్చింది. ఐఫోన్, వాచ్‌ల మధ్య నిరంతర సంబంధం ఉండాలంటే ఇది అవసరం. అలాగే ఈ రెండు పరికరాలూ ఒకే నెట్‌వర్క్‌పై పనిచేస్తూండాలి. ఇక ఐపాడ్‌లోనూ ఈ-సిమ్ ఉంటే వైఫై సదుపాయంలేని ప్రాంతంలో స్థానిక నెట్‌వర్క్‌కు దీని సాయంతో కనెక్ట్ కావచ్చు. మొత్తంమీద భౌతిక సిమ్‌కార్డుతో పోలిస్తే eSIM టెలికమ్యూనికేషన్ల పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తుందన్నది అతిశయోక్తి కాదు.