ఇప్పుడంతా ఆన్‌లైన్‌మయం. ఫుడ్ నుంచి ఏదైనా సరే ఆర్డర్ ఇస్తే క్షణాల్లో మీ ముందుకొచ్చి వాలుతుంది. ఫుడ్‌పాండా, స్విగ్గీ, జొమాటో ఇలా ఎన్నో ఫుడ్ డెలివరీ సర్వీస్‌లు మనకు తెలుసు. అయితే లక్నోలో ఓ టెక్ స్టార్టప్ టీ డెలివరీకి ఏకంగా డ్రోన్ తయారుచేసింది. టీ ఆర్డర్ ఇస్తే చాలు డ్రోన్ అలా గాలిలో ఎగురుకుంటూ వచ్చి ఘుమఘుమలాడే వేడి వేడి టీని మీ చేతికి అందిస్తుందన్నమాట. వావ్.. బాగుంది కదా.. అయితే అదేంటో చూసొద్దాం పదండి.
ఏమిటీ కాన్సెప్ట్?
ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి విక్రమ్‌సింగ్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి 2015లో టెక్ ఈగల్ సంస్థను స్థాపించారు. వీళ్లు ఫుడ్ డెలివరీ యాప్స్‌కి అనువుగా ఉండే డ్రోన్స్‌ను తయారు చేస్తున్నారు. అలా ఆర్డర్ స్పీడ్‌గా డెలివరీ చేయడం కోసం వీళ్లు ఓ డ్రోన్‌ను తయారు చేశారు. ఈ డ్రోన్ 2 కిలోల వరకు బరువును తీసుకొని 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌కు జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ ఎటాచ్ చేసి ఉంటుంది కాబట్టి అడ్రస్‌ను ఈజీగా లొకేట్ చేసి నిముషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తుంది. లక్నోకే చెందిన ఆన్‌లైన్ కాక అనే ఫుడ్ డెలివరీ స్టార్టప్‌తో కలిసి డ్రోన్ ద్వారా టీ డెలివరీకి టెక్ ఈగల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ డ్రోన్ 2 లీటర్ల టీని ఒకేసారి తీసుకెళ్లగలదు.
రూల్స్ ఒప్పుకుంటాయా?
ఇండియాలో డ్రోన్స్ తిరగాలంటే పర్మిషన్ కావాలి. అది కూడా విమానాలు, హెలికాప్టర్లు తిరగడానికి పర్మిషన్ ఇచ్చే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతివ్వాలి. అనుమతివ్వాలంటే ఏం చేయాలో డీజీసీఏకొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఇవి వస్తే ఇండియాలో కూడా ఫుడ్ డెలివరీ యాప్స్, ఈకామర్స్ సైట్లు డెలివరీకి డ్రోన్లు వాడుకోవడానికి మార్గం సుగమమవుతుంది. అప్పటివరకు ఇవి ఆవిష్కరణలకే గానీ నిజంగా వర్కవుట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఈ పర్మిషన్ ఇవ్వడం కూడా చాలా కష్టం. దేశ భద్రత కోణంలో డ్రోన్ల సంచారంపై చాలా నిషేధాలున్నాయి