వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిన ఫ్లిప్‌కార్ట్ తన వైల్డ్ కార్డ్‌ను బయటపెట్టింది. అదేమిటంటారా? అదే.. ఇన్సూరెన్స్! పరిశ్రమలో తొట్టతొలి స్మార్ట్‌ఫోన్ ఇన్సూరెన్స్- బజాజ్ అలియాంజ్ సాధారణ బీమా సంస్థతో భాగస్వామ్యంద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ రూ.99 నుంచి మొదలవుతుంది. ఫోన్ దొంగతనానికి గురైనా, ప్రమాదవశాత్తూ లిక్విడ్ లేదా స్క్రీన్ డ్యామేజ్ అయినా బీమా వర్తిస్తుందన్న మాట.
ఈ పాలసీ స్వరూపం ఎలా ఉంటుంది?
ప్రస్తుతానికైతే ఆరంభ బీమా పాలసీ రూ.99తో మొదలవుతుందని మాత్రమే సమాచారం ఉంది. మిగిలిన బీమా పాలసీల ప్రణాళిక ఎలా ఉంటుందన్నది ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే, ఇది స్మార్ట్ ఫోన్ ధరతోపాటు అందులోని ఫీచర్లకూ వర్తించేలా ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ప్రతి ఫోన్‌కూ బీమా పాలసీ కస్టమైజ్డ్‌గా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘మా సంపూర్ణ మొబైల్ రక్షణ కార్యక్రమం కింద మా వేదికద్వారా కొనుగోలు చేసే అన్ని ప్రధాన బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు బజాజ్ అలియాంజ్ సంయుక్తంగా కస్టమైజ్డ్ బీమా కవరేజీ ఇస్తుంది’’ అని అందులో పేర్కొంది.
ఈ బీమా ఏయే పరిస్థితుల్లో వర్తిస్తుంది...
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... ఈ బీమా పాలసీకింద రెండు అంశాలు కవరవుతాయి. ఒకటి... స్మార్ట్ ఫోన్ దొంగలపాలు కావడం. రెండోది... ప్రమాదవశాత్తూ- లిక్విడ్ లేదా స్క్రీన్ డ్యామేజ్ కావడం. మొదటి అంశం కింద ఫోన్‌ను దొంగలు కాజేస్తే... బీమా సంస్థ నిర్ణీత మొత్తం పరిహారంగా చెల్లిస్తుంది. దేశంలోని మొబైల్ వినియోగదారులలో 36 శాతం స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారే. అందువల్ల బీమా వ్యాపారానికి ఇది చాలా ఆకర్షణీయమైన మార్కెట్ అవుతుందనడంలో సందేహం లేదు. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి వాడకందారులు సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైనది స్క్రీన్ పాడుకావడమే. ఈ బీమా వైపు వినియోగదారులను ఆకర్షించేందుకు ఫ్లిప్‌కార్ట్ ఫోన్ ఉచిత పికప్, డ్రాప్, హోమ్ డెలివరీ సదుపాయాలను కల్పిస్తోంది. బీమా కవరేజీ వర్తించే మేరకు పరిహారం క్లెయిమ్ చేస్తే పరిశీలన తర్వాత పరిహారం సొమ్మును వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది లేదా వారి ఫోన్‌ను మరమ్మతు కోసం స్వీకరిస్తుంది. మరమ్మతు పూర్తయిన తర్వాత వారికి తిరిగి జాగ్రత్తగా చేరుస్తుంది.
‘‘బిగ్ బిలియన్ డే సేల్’’తో బీమా పథకానికి శ్రీకారం
ఈ నెల 10వ తేదీన బిగ్ బిలియన్ డే సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్- అదే రోజునుంచీ స్మార్ట్‌ఫోన్ బీమాను కూడా అమలు చేయడం ప్రారంభించింది. ఫోన్ కొన్న తర్వాత అది వినియోగదారుకు చేరిన తొలి రోజునుంచే దానికి బీమా రక్షణ ప్రారంభమవుతుంది. అయితే, ఇంతకుముందే చెప్పినట్లు ఫ్లిప్‌కార్ట్‌ద్వారా ఆన్‌లైన్‌లో కొన్న మొబైల్స్‌కు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ ఎత్తుగడ సరైనదేనా?
కచ్చితంగా సరైనదేనని చెప్పాలి... సాంకేతికార్థిక రంగంలో అత్యంత తాజా ఎత్తుగడ ఇన్సూరెన్స్ అనే చెప్పవచ్చు. ఆ మేరకు ఫ్లిప్‌కార్ట్ సరైన సమయంలో.. సరైన ఎత్తుగడ వేసింది. కొన్ని నెలల కిందట EMI పథకాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఈ పరిశ్రమలో మరోసారి అగ్రభాగాన నిలిచింది. సాంకేతికార్థిక పరంగా ముందడుగు వేస్తున్న ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ‘‘నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ’’ (NBFC) లైసెన్స్ కోసం దరఖాస్తు చేయనుందని, అది లభించాక వినియోగదారులు నేరుగా రుణాల కోసం ఆ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చునని సమాచారం. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ ఇప్పటికే ఏజెంట్ రూపంలో బీమా వ్యాపారంలో ప్రవేశించింది. ఇక మరో ఈ-కామర్స్ సంస్థ పేటీఎం కూడా ఇన్సూరెన్స్ వ్యాపారంలో అడుగుపెట్టడంపై ఆసక్తి చూపుతోంది. ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2020నాటికి రూ.20వేల కోట్ల స్థాయిని దాటిపోగలదన్న అంచనాల నేపథ్యంలో ఈ దిశగా ఆయా సంస్థల ప్రయత్నాల్లో ఆశ్చర్యం కలిగించేదేమైనా ఉందా?