గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని కొత్త లే అవుట్లను, ఆప్షన్లను గూగుల్ పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మ్యాప్స్ స్క్రీన్ దిగువన కనిపించే ‘‘డ్రైవింగ్ అండ్ ట్రాన్సిట్’’ ట్యాబ్‌ల స్థానంలో ‘‘కమ్యూట్ ట్యాబ్’’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ కొత్త ఆప్షన్‌మీద ట్యాప్ చేస్తే కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో టైటిల్ బార్ పైన ‘టు వర్క్’ లేదా ‘టు హోమ్’ అనే ఆప్షన్లలో ఒకదాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే, ఈ కొత్త కమ్యూట్ ట్యాబ్‌ను పరీక్షించే నిమిత్తం కొందరు వినియోగదారులకు మాత్రమే గూగుల్ అందుబాటులో ఉంచింది.
ఆండ్రాయిడ్ పోలీస్ వెబ్‌సైట్‌లో కొందరు గమనించిన సమాచారం మేరకు ఆండ్రాయిడ్ (వెర్షన్ 9.85.2) కోసం గూగుల్ మ్యాప్స్ ఈ కొత్త కమ్యూట్ ట్యాబ్‌ను పరీక్షిస్తోంది. ప్రత్యేకించి ‘డ్రైవింగ్ అండ్ ట్రాన్సిట్’ ట్యాబ్‌లను మేళవించడమే దీని ప్రధాన లక్ష్యం. పైన చెప్పినట్లు ‘టు హోమ్ లేదా టు వర్క్’ ఆప్షన్ల కింద ఎటు వెళ్లాలో నిర్ణయించుకునేందుకు స్క్రీన్ ఎగువన ఒక టైటిల్ బార్‌ను ఈ కొత్త ట్యాబ్ చూపుతుంది. అలా ఎంపిక చేసుకున్న ఆప్షన్ ఆధారంగా మనం వెళ్లాల్సిన మార్గాన్ని చూపే ‘రూట్ కార్డ్’ స్క్రీన్ దిగువన ప్రత్యక్షమవుతుంది. అందులో ‘ఆల్టర్‌నేట్ రూట్’ (ప్రత్యామ్నాయ మార్గం)ను కూడా సూచిస్తుంది.
దీంతోపాటు స్క్రీన్‌పైనగల మూడు నిలువు చుక్కల మెనూను ట్యాప్ చేసినప్పుడు ‘కమ్యూట్ సెట్టింగ్స్’ ఆప్షన్ కూడా కనిపించనుందని సమాచారం. అలాగే మన ప్రయాణమార్గపు ఉపగ్రహ చిత్రంసహా ఆ మార్గంలో ట్రాఫిక్, రోడ్డు పరిస్థితిని తెలుసుకోవడమేగాక మార్గాన్ని షేర్ చేసుకోగల సదుపాయం ఇందులో ఉండబోతోంది.
అయితే, ఈ కొత్త ఫీచర్‌తో గూగుల్ మ్యాప్స్ మరింత క్రమబద్ధం కానున్నప్పటికీ వాడకందారులకు అనువైన కొన్ని ఆప్షన్లను తొలగించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు కారు లేదా సిటీబస్సు వంటి ప్రజా రవాణా సాధనాలలో దేన్నయినా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడితే ఈ ఆప్షన్లు ‘‘కమ్యూట్ సెట్టింగ్స్’’ మాటున దాగి ఉంటాయి. ప్రస్తుతానికి ప్రయోగపూర్వకంగా పరీక్షించడం కోసం ఈ కొత్త ఫీచర్‌ను కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే గూగుల్ మ్యాప్స్ పరిమితం చేసింది. ఈ విస్తృత పరీక్షలు పూర్తయ్యాకే వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది.