స్మార్ట్ ఫోన్‌ను వాయిస్ కమాండ్స్‌తో వినియోగించగల తాజా యాప్ ‘‘Voice Access’’ను విడుదల చేసినట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక ఇబ్బందుల వల్ల టచ్‌స్క్రీన్‌ను వాడలేనివారికి ఇదెంతో సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. యాప్‌ల నావిగేషన్‌తోపాటు టెక్స్ట్ కంపోజింగ్, ఎడిటింగ్, ‘గూగుల్ అసిస్టెంట్’తో మాట్లాడటం, కొన్ని వాయిస్ కమాండ్స్‌తో నిర్దిష్ట గెశ్చర్లను వినియోగించడం వంటి పనులను ఈ కొత్త యాప్‌తో చేసుకోవచ్చు. గూగుల్ వాయిస్ యాక్సెస్ యాప్ బీటా వెర్షన్ 2016 ఏప్రిల్ నుంచే ప్రయోగ దశలో ఉంది. ఇది పరిమిత శరీర కదలికలు సాధ్యమైన వారికోసం ఉద్దేశించబడింది. “దీన్ని 10 సెకన్లు వాడగానే ఈ యాప్ మాయలో పడిపోయా”నంటూ దీని రూపకల్పన, ప్రయోగాత్మక దశలో పనిచేసిన గూగుల్ బృందం సభ్యురాలు స్టెఫానీ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇది తన జీవితంలో ఒక ప్రధాన భాగమైపోయిందంటూ ‘‘మీరు మీ గళంతో ప్రపంచాన్ని అందుకోవచ్చు’’ అని వినియోగదారులకు సూచించిందామె. గూగుల్ వాయిస్ యాక్సెస్ ఇంగ్లిష్ భాషలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండగా, త్వరలోనే ఇతర భాషల్లో తెస్తామని గూగుల్ చెబుతోంది.
వినియోగించడం ఎలా?
గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యాప్ సైజు కేవలం 4.6ఎంబీ మాత్రమే. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి Accessibility ట్యాబ్ కింద Voice Access ఫీచర్ స్విచ్‌ను ఆన్ చేసుకోవాలి. దీన్ని తొలిసారి వాడేవారికి యాప్ సెటప్, వాయిస్ కంట్రోల్స్ వినియోగం గురించి ఒక ట్యుటోరియల్ ప్లే అవుతుంది. వాయిస్ యాక్సెస్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవాలంటే Ok Google కమాండ్‌ను స్మార్ట్ ఫోన్‌లోని అన్ని లొకేషన్లలో యాక్టివేట్ చేసుకోవాలి. వాయిస్ యాక్సెస్ యాప్‌ను ప్రధానంగా పార్కిన్సన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ (కండరాల వ్యాధి), ఆర్థరైటిస్ (కీళ్లవ్యాధి), వెన్ను, వెన్నుపాము గాయంతో బాధపడుతున్న వారికోసం రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. అయితే, వివిధ పనుల్లో మునిగి ఉన్న సమయంలో ఎవరైనా వాయిస్ యాక్సెస్ తోడ్పాటుతో ఫోన్‌ను చేత్తో పట్టుకునే పనిలేకుండా వాడుకునే వీలుందని పేర్కొంది.
ఏమేం చేయొచ్చునంటే...
‘‘ఫోన్‌ను తాకకుండానే 'Ok Google' కమాండ్‌తో టెక్స్ట్ మెసేజ్ కంపోజ్ చేయొచ్చు.. ఎడిట్ చేయొచ్చు... మన ఫేవరిట్ యాప్‌ను 'open' కమాండ్‌తో తెరవొచ్చు.. కంపోజ్ చేసిన టెక్స్ట్‌లో దాని పక్కన వాయిస్ యాక్సెస్ చూపే అంకెను చెప్పి పదాలను సెలెక్ట్ చేయొచ్చు... వాటిని వేరే పదాలతో మార్చవచ్చు. ఉదాహరణకు ‘రేపు’ అని ఉంటే ‘శనివారం’ అని మార్చుకోవచ్చు’’ అని గూగుల్ సెంట్రల్ యాక్సెసబిలిటీ టీమ్ ప్రాడక్ట్ మేనేజర్ పాట్రిక్ క్లేరీ చెప్పారు.
గమనిక: గూగుల్ సపోర్ట్ పేజీలో ‘‘వాయిస్ యాక్సెస్’’తో వాడుకునే ‘‘వాయిస్ కమాండ్స్’’ జాబితాను చూడొచ్చు.