తమ యాప్‌లో చాటింగ్ చాలా సురక్షితం.. ఎండ్ టు ఎండ్ ఇన్‌క్రిప్షన్‌తో మీ వివరాలు భద్రం..అంటూ వాట్సప్ లాంటి సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని మెసేజింగ్ యాప్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కోసమే ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజాగా ఒక మెసేజింగ్ యాప్‌ను రంగంలోకి తీసుకొచ్చింది గూగుల్. ఇప్పటికే హ్యాంగ్ ఔట్స్, వాయిస్, గూగుల్ టాక్, గూగుల్ ప్లస్ లాంటి మెసేజింగ్ యాప్‌లు తెచ్చిన గూగుల్ తాజాగా చాట్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడమే ఇక్కడ విశేషం.
ఆర్‌సీఎస్ బేస్డ్‌గా..
ఆర్‌సీఎస్ బేస్డ్ మెసేజింగ్ స్టాండర్డ్‌తో వస్తున్న చాట్ ఫీచర్ ఇప్పడు అందరి దృష్టిలో ఉంది. యూనివర్సల్ ప్రొఫైల్ ఫర్ రిచ్ కమ్యునికేషన్ సర్వీసెస్ బేస్డ్‌గా ఈ చాట్‌ను నడిపించనున్నట్లు ఇటీవలే గూగుల్ తెలిపింది. ఓఈఎంఎస్‌ల సాయంతో ఆర్‌సీఎస్‌ను బేస్ చేసుకుని చాట్‌ను ముందుకు తీసుకు రావాలనేది ఆ సంస్థ వ్యూహం. సొంతగా ఒక మెసేజింగ్ యాప్ ఉండాలనే ఉద్దేశంతోనే చాట్ మీద బాగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ బేస్డ్‌గా ఆర్‌సీఎస్ పని చేయనుంది.
10 ఎంబీ వరకు...
10 ఎంబీ వరకు ఫొటోలు, వీడియోలు పంపుకునే విధంగా ఇది రూపొందింది. అయితే దీనిలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం. దీని వల్ల ఇది ఎంత వరకు సేఫ్ అన్నదే దీనిలో ప్రశ్న. ప్రస్తుతానికి శాంసంగ్ ఆర్‌సీఎస్ ద్వారా మెసేజింగ్ యాప్‌ను నడిపిస్తోంది. అలో ఫీచర్ల ద్వారా చాట్ మెసేజింగ్ యాప్‌ను ప్రాచుర్యంలోకి తేవాలనేది గూగుల్ ఆలోచన. మొదట ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆ తర్వాత ఐఓఎస్‌లకు దీన్ని అందుబాటులో తేవాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.