తల్లిదండ్రులు తమ టీనేజీ పిల్లల ఫోన్లను వారి గూగుల్ అకౌంట్స్‌ద్వారా ‘‘ఫ్యామిలీ లింక్’’తో నియంత్రించవచ్చు. తల్లిదండ్రుల అదుపులో ఉండే FAMILY LINK నియంత్రణ హబ్‌ద్వారా 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ గత సంవత్సరం నుంచీ సొంత అకౌంట్లు ప్రారంభించే వీలు కల్పించింది. ఇప్పుడు ఇందులో పిల్లలకు అనువైన ఫీచర్లను మరింత విస్తరిస్తోంది. అయితే, తల్లిదండ్రులు స్క్రీన్ టైమ్ పరిమితులను నిర్ధారించేందుకు ఫ్యామిలీ లింక్ వెసులుబాటు కల్పించింది. ఆ మేరకు బ్రేక్ సమయంలో పిల్లల ఫోన్లను అమ్మానాన్నలు లాక్ చేయవచ్చు. అలాగే ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ను అనుమతించవచ్చు లేదా నిరోధించవచ్చు. అంతేకాదు... వారెక్కడున్నారో వారి ఫోన్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుండగా, త్వరలోనే Chromebooksలో కూడా అందుబాటులోకి వస్తాయి.
గూగుల్ అకౌంట్ ఉన్నవారందరికీ ఫ్యామిలీ లింక్ సాంకేతికంగా అందుబాటులోనే ఉంది. అందువల్ల పాత అకౌంట్ హోల్డర్లకు ఫీచర్లను విస్తరించడంద్వారా కుటుంబంలో అందరి ఆన్‌లైన్ భద్రతను పర్యవేక్షించేందుకు అవకాశం కల్పించాలని గూగుల్ భావిస్తోంది. అయితే, 13 ఏళ్లు దాటినవారి విషయంలో రెండు పక్షాలనుంచీ ఇందుకు సమ్మతి ఉండాలి. అకౌంట్ హోల్డర్‌కు ఇష్టంలేకపోతే ఫ్యామిలీ లింక్ పర్యవేక్షణను ఎనేబుల్ చేయడం కోసం వారు తమ పాస్‌వర్డ్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అలాగే పర్యవేక్షణలో ఉన్న టీనేజీ పిల్లలు తాము కోరుకుంటే ఆ పరిధినుంచి బయటపడవచ్చు. అయితే, దీనికిముందు వారి ఫోన్ 24 గంటలపాటు లాక్ అయిపోతుంది.
ఫ్యామిలీ లింక్ యాప్‌తో పిల్లల ఫోన్లను లాక్ చేస్తున్న తల్లిదండ్రులు ఇకపై తమ వాయిస్ కమాండ్‌తో ‘‘గూగుల్ అసిస్టెంట్’’కు ఆ బాధ్యత అప్పగించవచ్చు. ఇందుకోసం ‘‘హే గూగుల్, లాక్ జానీస్ డివైజ్ (Hey Google, lock Johnny’s device)’’ అని కమాండ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఫోన్ లాక్ అయ్యేలోగా వారు తమ పని పూర్తిచేసుకోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంటుంది.
ఫ్యామిలీ లింక్‌తో నియంత్రించే అకౌంట్లకు కుటుంబ హితమైన కంటెంట్‌ను ఈ గూగుల్ అసిస్టెంట్ అప్‌డేట్‌ద్వారా యాడ్ చేయవచ్చు. ఆరు విభిన్న స్వరాలను గూగుల్ అసిస్టెంట్ గుర్తించగలదు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు వారి గొంతును బట్టి పిల్లల ప్రశ్నలకు తగినట్లుగా ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు... ‘‘హే గూగుల్, చెక్ ఫర్ మాన్‌స్టర్స్’’ అని పిల్లలు చెబితే- అది మాన్‌స్టర్స్ కోసం గదిని స్కాన్ చేస్తున్నట్లు లేజర్ శబ్దాలు చేస్తూ, ‘‘ఆల్ క్లియర్!’’ (మాన్‌స్టర్స్ లేవు) అని జవాబిస్తుంది. ముందుగా అమెరికాలో అందుబాటులోకి వచ్చిన అసిస్టెంట్ కొత్త ఫీచర్లు ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించాయని గూగుల్ చెబుతోంది.