మద్రాస్ ఐఐటీలోని పరిశోధకులు, పరిశోధక విద్యార్థులు అద్భుతం సృష్టించారు. ‘‘శక్తి’’ పేరిట భారత దేశపు లేదా సొంత లేదా స్థానిక తొలి స్వీయ RISC-V మైక్రో ప్రాసెసర్‌ను రూపొందించారు. భారత్‌లో... భారత్ చేత స్వదేశంలో ఈ మైక్రో ప్రాసెసర్ తయారు చేయబడిన నేపథ్యంలో ఇకపై విదేశాల నుంచి మైక్రోచిప్‌ల దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి మనకు తప్పుతుంది. దీన్ని నిఘా కెమెరాలు, స్మార్ట్ ఫోన్లలో కూడా వాడుకోవచ్చు. విదేశీ ప్రైవేటు సంస్థల కంప్యూటర్ల కోసం ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం లేదా భారత్‌లో విదేశీ కంపెనీల కోసం తయీరు చేయడం కాకుండా స్వదేశంలో సొంతంగా మైక్రో ప్రాసెసర్‌ను తయారు చేసుకోవడం- అంటే భారత్‌లోనే దీని ఆవిర్భావం మనకెంతో ప్రత్యేకం. కాగా, భారత్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్రతో తొలి మైక్రో ప్రాసెసర్‌ను అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ఇంటెల్ సారథ్యాన బెంగళూరులో ఏర్పాటైన పరిశోధన-అభివృద్ధి కేంద్రం 2017 ఆగస్టులో విడుదల చేసింది. ఆ విధంగా చూస్తే భారత్‌లో తయారైన తొలి మైక్రో ప్రాసెసర్ ఇదే అయినా, దీని వెనుక ఉన్న సంస్థ, సాంకేతిక పరిజ్ఞానం, కూర్పు భారత దేశానికి చెందినవి కావు. ఈ నేపథ్యంలో మన ‘శక్తి’కి అవసరమైన మైక్రో చిప్‌ను చండీగఢ్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన సెమీ-కండక్టర్ లేబొరేటరీ (SCL) కూర్పు చేసింది. దీనికి రూపమిచ్చిన మద్రాస్ ఐఐటీ చెబుతున్న మేరకు- రక్షణ, అణు రంగాలతోపాటు భారత ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్‌ీలలోకి దొడ్డిదారిన చొరబడే మాల్‌వేర్, హార్డ్‌వేర్ ట్రోజన్ల వంటి వైరస్‌ల ముప్పును గణనీయంగా తగ్గించడంలో ‘శక్తి’ అత్యంత సమర్థంగా తోడ్పడుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్‌ను ఎంబెడెడ్ లో-పవర్ వైర్‌లెస్ సిస్టమ్‌లు, నెట్‌వర్క్ వ్యవస్థలలో భేషుగ్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే సమాచార, రక్షణ రంగాలు విదేశీ మైక్రో ప్రాసెసర్లపై ఆధారపడే దురవస్థ కూడా ఇకపై ఉండదు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు ఎంతమాత్రం తీసిపోదు కాబట్టి ఇతర రంగాలు కూడా దీన్ని చక్కగా వాడుకునే వీలుందని మద్రాస్ ఐఐటీ అధికార ప్రకటన తెలిపింది. సిస్టమ్ ఆన్ ది చిప్ (SoC) ఆధారిత ‘శక్తి’ సి-క్లాస్ సంకేత నామం RIMO. దీని సైజు 144 చదరపు మిల్లీమీటర్లు కాగా, 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ వరకూ ఆపరేట్ అవుతుంది. ఇక SoC అంటే- కంప్యూటర్‌లోని అన్ని భాగాలనూ అనుసంధానించే సమగ్ర సర్క్యూట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థ అన్నమాట! ఈ భాగాలు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమొరీ, ఇన్‌పుట్/అవుట్‌పుట్ పోర్ట్స్, సెకండరీ స్టోరేజ్ తదితరాలన్నీ కలగలసి ఒకే వేదిక రూపంలో ఉంటుందని ప్రకటన పేర్కొంది. మద్రాస్ ఐఐటీలోని ‘RISE’ గ్రూప్ చొరవతో ఓపెన్ సోర్స్ ఆవిష్కరణగా ‘శక్తి’ ఆవిర్భవించింది. ఓపెన్ సోర్స్, ఉత్పత్తి అర్హతగల ప్రాసెసర్లను రూపొందించడం మాత్రమేగాక ఇంటర్ కనెక్ట్ ఫ్యాబ్రిక్స్, వెరిఫికేషన్ టూల్స్, స్టోరేజ్ కంట్రోలర్స్, పెరిఫెరల్ IPలు, SOC టూల్స్ అభివృద్ధి చేయడంలోనూ ఈ గ్రూప్ పాలుపంచుకుంటోంది. ప్రాజెక్ట్ ‘శక్తి’కి కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆర్థిక తోడ్పాటునిచ్చింది. ప్రభుత్వ వెన్నుదన్నుతో రూపొందిన ‘శక్తి’ వంటి ఓపెన్ సోర్స్ పర్యావరణ వ్యవస్థ- భిన్న ఓపెన్ సోర్స్ లేదా సాధికార IPలు, కొత్త ప్రాజెక్టు సంబంధిత ఆలోచనలలో వినియోగదారులు పాలుపంచుకోగల ఉత్సాహప్రోత్సాహాలను ఇస్తుందనడంలో సందేహం లేదు.