ఇండియన్ రైల్వే తన టికెట్ రిజర్వేషన్ సర్వీస్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. కొత్త ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులు చేసింది. www.irctc.co.in బీటా వెర్షన్‌లో ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇండియాలో ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేసుకునే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్‌లైన్లోనే చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకం కింద ఆన్‌లైన్ ట్రైన్ రిజర్వేషన్ ప్రాసెస్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. బీటా వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయి ఇందులో ఉన్న ఫెసిలిటీస్‌ను చూడొచ్చు. మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వచ్చు.
కొత్త ఇంటర్‌ఫేస్‌లో హైలెట్స్
* యూజర్లు లాగిన్ అవకుండానే ట్రైన్స్‌ను సెర్చ్‌చేయొచ్చు. సీట్లు, బెర్తులు ఎన్ని ఉన్నాయో చెక్‌చేసుకోవచ్చు. ఇది యూజర్లకు చాలా టైమ్ సేవ్ చేస్తుంది. అంతేకాదు వెబ్‌సైట్‌లో ఫాంట్ సైజ్‌ను కూడా కావాల్సినట్లు పెంచుకోవచ్చు.
* ట్రైన్, గమ్యస్థానం, ట్రైన్ వచ్చే సమయం, బయల్దేరే టైమ్, క్లాస్‌ల వారీగా ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల యూజర్‌కు సెర్చ్ చాలా ఈజీ అవుతుంది.
* ట్రైన్ నెంబర్, పేరు, మీరు ట్రైన్ ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్, వాటి మధ్య దూరం, ఎక్కే టైమ్, దిగే టైమ్, జర్నీ టైమ్ అన్నీ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తాయి
• ‘My Transactions’ సెక్షన్‌లో కూడా కొత్త ఫీచర్లు పెట్టారు. జర్నీ డేట్, బుకింగ్ డేట్, అప్‌కమింగ్ జర్నీ, కంప్లీటెడ్ జర్నీలను బట్టి సెర్చ్‌చేసుని చూసుకోవచ్చు.
* ట్రైన్స్‌ను రకరకాల కలర్స్‌తో స్పెసిఫై చేశారు. దీంతో సెర్చ్ ఈజీ అవుతుంది.
* కొత్త ఇంటర్‌ఫేస్ ద్వారా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చు. కావాలంటే అడిషనల్ ఎస్ఎంఎస్ తీసుకోవచ్చు.
వెయిట్‌లిస్ట్ ప్రెడిక్షన్
ఇక కొత్త ఇంటర్‌ఫేస్‌లో అత్యం కీలకమైంది వెయిట్ లిస్ట్ ప్రెడిక్షన్ (Waitlist prediction). ఈ ఫీచర్ ద్వారా వెయిట్ లిస్ట్ లేదా ఆర్ ఏసీ కేటగిరీలో ఉన్న టికెట్లు ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయో సైట్ చెబుతుంది. గత కొన్నాళ్లలో ఆ ట్రైన్‌లో లేదా రూట్‌లో ఎంత వరకు వెయిట్‌లిస్ట్ లేదా ఆర్ఏసీ కన్ఫర్మ్ అయిందనే డేటా ఆల్గరిథమ్స్‌ను విశ్లేషించి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చెబుతుంది.
ఎలా పనిచేస్తుంది?
ఇలాంటి ప్రెడిక్షన్ సర్వీసులు ఇప్పటికే గూగుల్‌లో చాలా ఉన్నాయి. టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాక పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు చెప్పే సైట్లు కొన్ని అయితే ముందే ట్రైన్‌ను బట్టి చెప్పేవి కొన్ని సైట్లు. ఈ ప్రెడిక్షన్ కొన్నిసార్లు నిజం కావచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. అయితే ఇవి ఆథరైజ్డ్ వెబ్‌సైట్లేమీ కాకపోవడంతో దీనిమీద యూజర్లు పెద్దగా ఆశలు పెట్టుకోరు. అదే ఐఆర్‌సీటీసీనే సొంతంగా ప్రెడిక్షన్ చెబితే యూజర్లు చాలావరకు నమ్ముతారు. అది కన్ఫర్మ్ అయితే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కే చాలా మేజర్ ప్లస్‌పాయింట్ అవుతుంది. రైల్వే తన సొంత డేటాబేస్‌ను ఉపయోగించుకుంటుంది కాబట్టి కన్ఫర్మేషన్ అంచనాలు చాలావరకు నిజమవ్వచ్చని అంచనా.