ఐఆర్‌సీటీసీలో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే పేమెంట్ సెక్షన్‌కి వచ్చేసరికి మాత్రం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్లు వాడుకోవాల్సిందే. ఆ ప్రాసెస్ ఎంత ఇబ్బందో రిజర్వేషన్ చేసుకునేవాళ్లందరికీ అనుభవమే. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ టైంలో ఈ డిటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసరికి ఉన్న కాసిన్నిటికెట్లు అయిపోవడం చాలా మంది ఫేస్ చేసి ఉంటారు కూడా. ఐఆర్‌సీటీసీ త్వరలో లాంచ్ చేయబోతున్న సొంత పేమెంట్ గేట్ వేతో ఈ ఇబ్బందులన్నీ తీరబోతున్నాయి.
ఆగస్టులో లాంచింగ్
ఐఆర్‌సీటీసీ తన సొంత పేమెంట్ గేట్‌వే - ఐపే (IPay)ను ఆగస్టులో లాంచ్ చేయబోతోంది. డిజిటల్ పేమెంట్ ప్రొవైడర్‌గా ఉండాలంటే PCI-DSS సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉండాలి. పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ సెక్యూరిటీ స్టాండర్డ్ కౌన్సిల్ ఇటీవలే ఐఆర్‌సీటీసీకి ఈ సర్టిఫికెట్ జారీ చేసిందని ఐఆర్‌సీటీసీ రీసెంట్‌గా ట్వీట్ చేసింది. దీంతో ఇకపై సొంత పేమెంట్ గేట్‌వే ద్వారా ఐఆర్‌సీటీసీలో చెల్లింపులు జరుపుకోవచ్చు. ప్రస్తుతం రోజూ ఐఆర్‌సీటీసీ ద్వారా మూడు లక్షల మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఐ పే వస్తే పేటీఎం, మొబీక్విక్ లాంటి వాలెట్ల రైల్వే టికెట్స్ బిజినెస్‌కి భారీగా గండిపడనుంది.
మనకేంటి ఉపయోగం?
* ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేయాలంటే డిటెయిల్స్ అన్నీ ఇచ్చి టికెట్ బుక్ చేసుకునేముందు పేమెంట్ గేట్‌వేలోకి వెళ్లి కార్డ్ నెంబర్, డిటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేసి పేమెంట్ చేయాలంటే కనీసం రెండు నిముషాలు పడుతుంది. తత్కాల్ టికెట్ల విషయంలో ఈ రెండు నిముషాలు చాలు. అక్కడున్న టికెట్లన్నీ అయిపోవడానికి. ఐ పే ద్వారా టికెట్స్ తీసుకోవడం స్పీడ్‌గా అయిపోతుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముందుగానే మనం ఐ పే వాలెట్‌లో మనం మనీ లోడ్ చేసి పెట్టుకుంటే సింగిల్ క్లిక్‌తో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
* ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మాత్రమే అనుమతిస్తుంది. మిగిలిన డెబిట్ కార్డ్‌లతో పే చేయడానికి ఆప్షనే ఉండదు. అంటే మిగిలిన బ్యాంక్‌ల డెబిట్ కార్డ్‌లున్నవాళ్లు ఇప్పటివరకు టికెట్లు తీసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ వాడుకోవాల్సి వచ్చేది. అది కూడా లేకపోతే మరీ ఇబ్బందయ్యేది.
* ఐపే ద్వారా టికెట్లు తీసుకుంటే రిఫండ్ ప్రాసెస్ సులువుగా, వేగంగా అయిపోతుంది. ఇప్పుడు క్రెడిట్/ డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్ల ద్వారా టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సొమ్ము తిరిగి రావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఐ పేతో అంత లేటవదు.