కల్పిత మేధస్సు (Artificial Intelligence-AI) ఆధారిత సీసీటీవీ కెమెరాలతో కూడిన తొలి ‘‘స్మార్ట్’’ బోగీని భారత రైల్వేశాఖ ఇటీవలే అందుకుంది. రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ ఈ బోగీని రూపొందించింది. ప్రయాణికులకు సౌకర్యంతోపాటు రైలు ప్రయాణంలో భద్రత, రక్షణల మెరుగుదిశగా ఇందులో సరికొత్త సదుపాయాలున్నాయని భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తొలి బోగీని అందుకున్న నేపథ్యంలో ఇలాంటి మరో 100 బోగీలను త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటించింది.
ఈ స్మార్ట్ బోగీలలో ‘‘బ్లాక్ బాక్స్, బోగీ సమాచార, విశ్లేషణ’’ వ్యవస్థలుంటాయి. ఈ మేరకు బ్లాక్ బాక్స్‌లలో బోగీ పరిస్థితి, ప్రయాణిక సంబంధ సందేహాలపై తక్షణ వివరాలందించే శక్తిమంతమైన బహుముఖ సమాచార వ్యవస్థ ఉంటుంది. ఇక కల్పిత మేధస్సు ఆధారిత సీసీటీవీల ఫుటేజీ పరిశీలనద్వారా తో రైలు భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయి. దీంతోపాటు రైల్వే సిబ్బంది పనితీరుపైనా నిఘా పెరుగుతుంది. రిమోట్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీటీవీలను పర్యవేక్షించడం ద్వారా రైలు ప్రయాణంలో అవాంఛనీయ సంఘటనల నివారణ, దుండగుల గుర్తింపు, సత్వర దర్యాప్తు వంటి వెసులుబాట్లు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది.
జీపీఎస్ ఆధారంగా ప్రయాణికుల కోసం ప్రకటనలు, సమాచారం అందించడంతోపాటు గమ్యం చూపించే డిజిటల్ బోర్డుల వ్యవస్థ కూడా స్మార్ట్ బోగీలలో ఉంటుంది. దీనివల్ల రైలు ఏ ప్రాంతంలో ఉంది... దాని వేగమెంత?... తదుపరి స్టేషన్‌కు చేరే అంచనా సమయంవంటి సమాచారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికుల (ప్రత్యేకించి మహిళలు, పిల్లల)కు రక్షణ లక్ష్యంగా రైలు గార్డుతో అత్యవసర సంభాషణ వ్యవస్థ ఈ స్మార్ట్ బోగీలలో ఉంటుంది. దీనివల్ల వారికి అవసరమైన సహాయం అందించే వీలుంటుంది. దీంతోపాటు వై-ఫై హాట్‌స్పాట్ సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
బోగీల చక్రాలకు ‘‘కంపన ఆధారిత-స్వీయ విద్యుత్ సమీకరణ సెన్సర్’’ (vibration-based self-power harvesting sensor) వ్యవస్థ ఉంటుంది. తాము పరుగు తీయబోయే పట్టాలు దృఢమైనవేనా/బలహీనంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఈ సెన్సర్ పసిగట్టగలదు. ఈ వ్యవస్థలోని విద్యుత్ సమీకరణ పరికరం బోగీ కుదుపులనుబట్టి చార్జింగ్ చేస్తూంటుంది. భారతీయ రైల్వేల కోసం త్రిపుర రాష్ట్రంలోని కోచ్ ఫ్యాక్టరీలో జర్మనీ సంస్థ ‘‘లింక్-హాఫ్‌మన్-బుష్’’ (LHB) తయారుచేసే బోగీలలో ఈ అత్యాధునిక సెన్సర్లను అమరుస్తున్నారు. ఈ బోగీల సెన్సర్లను కేంద్రీకృత కంప్యూటర్‌కు అనుసంధానించి అన్నిటినీ ఒకేచోటినుంచి పర్యవేక్షిస్తారు. ‘పిక్కూ’ (Passenger Information and Coach Computing Unit)గా పిలిచే ఈ కేంద్రీకృత ప్రక్రియ యూనిట్‌కు జీఎస్ఎం నెట్‌వర్క్ సదుపాయం ఉంటుంది. దీని సాయంతో బోగీ నిర్వహణ, ప్రయాణిక సదుపాయాల పర్యవేక్షణ సాధ్యమని రైల్వేబోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ చెప్పారు.