మన ఫోన్ లలో ఉండే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం అదేనండీ జిపిఎస్ మన దేశానికి సంబందించినది కాదు అనీ అది అమెరికా ఆధీనం లో ఉంటుందనీ మీలో ఎంతమందికి తెలుసు? రాకెట్ సైన్సు లో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న ఇండియా కు స్వంత జిపిఎస్ సిస్టం లేకపోవడం ఒక వెలితి లాగే భావించవచ్చు. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేదు. మన దేశం కూడా తన స్వంత జిపిఎస్ సిస్టం అయిన నావిక్ ను అతి త్వరలోనే దేశం లోని అన్ని స్మార్ట్ ఫోన్ లలో ప్రవేశపెట్టనుంది. అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. ఇకపై మన ఫోన్ లలో మన స్వంత జిపిఎస్ ఉండబోతోంది.భారత ప్రభుత్వం నుండి అందిన అధికారిక సమాచారం ప్రకారం ఇండియా యొక్క మొట్టమొదటి స్వదేశీ జిపిఎస్ సిస్టం అయిన నావిక్ అతి త్వరలోనే లాంచ్ అవడానికి సిద్దంగా ఉంది. ఇండియాలోని ప్రతీ స్మార్ట్ ఫోన్ దీనిని యాక్సెస్ చేయడమే గాక వాటిలో ప్రైమరీ జిపిఎస్ ఫ్లాట్ ఫాం గా ఈ నావిక్ నే ఉపయోగించనున్నాయి. ఇందుకు సంబంధించి మొదటగా దీనిని ఉపయోగించవలసిందిగా ప్రైవేటు ప్లేయర్స్ కు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పంపినట్లు ఐటి సెక్రెటరీ అయిన శ్రీ అజయ్ ప్రకాష్ తెలిపారు. ఇది పబ్లిక్ మరియు ప్రైవేటు ఎంటిటీ లకు అందుబాటులోనికి రానుందని ఐటి మంత్రి అయిన శ్రీ రవి శంకర్ ప్రసాద్ కూడా తెలిపారు. ఈ నేపథ్యం లో దీనియొక్క విశేషాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
నావిక్ యొక్క నేపథ్యం మరియు విశేషాలు
- నావిక్ అనేది ఒక సంస్కృత పదం. సంస్కృతం లో దీని అర్థం నావికుడు అని. ఇక NavIC యొక్క పూర్తి రూపం నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్ట లేషన్ . ఇది 8 కృత్రిమ ఉపగ్రహాల సమూహం అయిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం యొక్క ఆపరేషనల్ పేరు. ఈ శాటిలైట్ ల సమూహం లో ఉన్న కృత్రిమ ఉపగ్రహాల సంఖ్యను అతి త్వరలోనీ 8 నుండి 11 కు పెంచనున్నారు.
- 7 వ శాటిలైట్ అయిన IRNSS 2016 లో లాంచ్ అవగా ఎనిమిదవది అయిన IRNSS-II గత ఏప్రిల్ లో తన కక్ష్య లో ప్రవేశపెట్టబడింది.
- అమెరికా కు చెందిన జిపిఎస్ సిస్టం తో పోలిస్తే ఈ నావిక్ మరింత ఖచ్చితత్వం తో పని చేయనుంది. భూమిమీద ఏదేని ఒక పొజిషన్ ను అమెరికన్ జిపిఎస్ సిస్టం 15-20 మీటర్ల ఖచ్చితత్వం తో అందిస్తుండగా ఈ నావిక్ కేవలం 5 మీటర్ల ఖచ్చితత్వం తో అందించనుంది.
- ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్ అనే ఒక సరికొత్త టెక్నాలజీ ని ఇస్రో ఇందులో ఉపయోగించింది. ఈ మొత్తం సెట్ అప్ కు రూ 1400ల కోట్లు ఖర్చు అయింది.
- యూఎస్ కాకుండా ఇప్పటివరకూ రష్యా మరియు యూరోపియన్ యూనియన్ లు మాత్రమే తమ స్వంత జిపిఎస్ ను కలిగి ఉన్నాయి. రష్యా యొక్క జిపిఎస్ గ్లోనాస్ కాగా గెలీలియో పేరుతో యూరపియన్ యూనియన్ జిపిఎస్ ను కలిగి ఉంది. ఇప్పుడు మన దేశం స్వంత జిపిఎస్ ను కలిగి ఉన్న మూడవ దేశం గానూ నాలుగవ సంస్థగానూ నిలువనుంది.
- మన పొరుగుదేశం అయిన చైనా కూడా తన స్వంత జిపిఎస్ అయిన బెయిడూ ను సిద్డంచేస్తూ 2020 కల్లా లాంచ్ చేసే సన్నాహాల్లో ఉంది.
- కార్గిల్ యుద్దం సమయం లో టెర్రరిస్ట్ ల అడుగుజాడలను కనిపెట్టడానికి జిపిఎస్ కో-ఆర్డినేట్ లను అడిగితే అమెరికా తిరస్కరించి పరోక్షంగా పాకిస్తాన్ కు సహయం, చేసింది. ఆ యుద్దం లో మన దేశం విజయం సాధించినప్పటికీ దీనివలన కొంత నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. అప్పటినుండీ మన దేశం స్వంత జిపిఎస్ సిస్టం ను తయారు చేయాలని నిశ్చయించుకుని ఇన్నాళ్ళకు పూర్తి చేసింది. ఇకపై జిపిఎస్ కోసం మన దేశం ఏ దేశం పై ఆధారపడవలసిన అవసరం లేదు.