• తాజా వార్తలు

ప్రివ్యూ - ఎస్ఎంఎస్ ని కనుమరుగు చేసే విధ్వంసక ఆవిష్కరణ ఆర్సీఎస్

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ కాల్స్ మాత్రమే కాదు.. ఎస్ఎంఎస్ (షార్ట్ మెసేజింగ్ సర్వీస్) కూడా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందనేది మనందరికీ తెలిసిందే. ఇటీవల స్మార్ట్ ఫోన్లు వచ్చి, మెరుగైన ఆప్షన్లతో చాటింగ్లు మొదలయ్యే వరకూ ఎస్ఎంఎస్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఇప్పటికీ అనేక సేవలకు ఎస్ఎంఎస్ నే విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో ఎస్ఎంఎస్ ఇక కనుమరుగు అయిపోనుంది. దాని స్థానంలో మరో విప్లవాత్మకమైన ఆర్సీఎస్ (RCS) అనే సౌకర్యం మన ఫోన్లలో అందుబాటులోకి రానుంది.   

ఏమిటీ ఆర్సీఎస్?

ఆర్సీఎస్(RCS) అంటే రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్ కు సంక్షిప్త నామం. టెక్స్ట్, మల్టీమీడియా మెసేజీలను మరింత రిచ్ గా అంటే అద్భుతంగా మార్చేసే టెక్నాలజీ ఇది. సింపుల్ గా చెప్పాలంటే.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర యాప్ లలో మాదిరిగా అన్ని ఫీచర్లతో చాటింగ్ చేసుకునేందుకు వీలయ్యే ఎస్ఎంఎస్ కు అధునాతనమైన మరో రూపమే ఆర్సీఎస్. ఆర్సీఎస్ ద్వారా చాటింగ్ చేసేటప్పుడు కూడా అవతలివారు లైన్లో ఉన్నారా? మన మెసేజీ చదివారా? వారు టైప్ చేస్తున్నారా? వంటి విషయాలన్నీ మనకు తెలిసిపోతాయి! అంటే ఇది టెక్స్ట్ మెసేజింగ్ అనుభవాన్ని పూర్తిస్థాయి చాట్ ఎక్స్ పీరియన్స్ గా మార్చేసే విధ్వంసకర ఆవిష్కరణ అన్నమాట!!    

ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం ఆపిల్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఐమెసేజ్ తరహాలోనే ఇది కూడా ఆర్సీఎస్ ను సపోర్ట్ చేసే ఫోన్లకు అందుబాటులోకి వస్తుంది. అయితే, ఐమెసేజ్ లాగా ఒకే బ్రాండ్ ఫోన్లలో లేదా ఒకే ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్)పై మాత్రమే కాకుండా.. ‘యూనివర్సల్ ప్రొఫైల్’ ఉన్న అనేక రకాల బ్రాండ్ల ఫోన్లు, వేర్వేరు టెలికం ఆపరేటర్ల ద్వారా, వేర్వేరు ఆపరేటింగ్ సిస్టంలపైనా ఇది పనిచేస్తుంది. మరి మన దగ్గర ఆర్సీఎస్ ను సపోర్ట్ చేసే ఫోన్ ఉండి, అవతలివారి దగ్గర అలాంటి ఫోన్ లేకపోతే? మన మెసేజీలు ఎలా వెళతాయి? అన్న డౌట్ వచ్చిందా? ఆ మెసేజీలు యథావిధిగా వారికి ఎస్ఎంఎస్ లుగా కన్వర్ట్ అయి చేరతాయి కాబట్టి, మన మెసేజీలు పోయే చాన్సే ఉండదు!  

ఏ ఫోన్లు ఆర్సీఎస్ ను సపోర్ట్ చేస్తాయి?

ఆర్సీఎస్ పనిచేసేందుకు మీ ఫోన్లో దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ మాత్రమే ఉంటే చాలదు. మీ ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టంతోపాటు మీ మొబైల్ ఆపరేటర్ కూడా ఈ సర్వీస్ ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల దీనిని సాకారం చేసేందుకు ఇంకా చాలా ప్రయత్నాలే ఫలించాల్సి ఉంది.

ఇప్పటికే పలు మొబైల్ ఆపరేటర్లు ఆర్సీఎస్ ను సపోర్ట్ చేసే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. మరికొన్ని కంపెనీల వద్ద ఈ టెక్నాలజీ లేదు. మరోవైపు దీనిని అన్ని మొబైల్ ఆపరేటర్ల మధ్య ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు తప్పనిసరి అయిన ప్రత్యేక ఫీచర్లు లేనందున కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ చిక్కులను పరిష్కరించేందుకే ‘యూనివర్సల్ ప్రొఫైల్’ సృష్టించబడింది. కొన్ని సాధారణమైన ఫీచర్లతో కూడిన సెట్ ను, ఆర్సీఎస్ ను సపోర్ట్ చేసే సాఫ్ట్ వేర్ తో ఈ యూనివర్సల్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఇందులోని అన్ని ఫీచర్లను అంగీకరించే మొబైల్ ఫోన్ కంపెనీలు, ఆపరేటర్లందరికీ ఆర్సీఎస్ అందుబాటులోకి వస్తుంది. వాస్తవానికి యూనివర్సల్ ప్రొఫైల్ ను సపోర్ట్ చేసేందుకు అనేక మొబైల్ మానుఫాక్చర్ కంపెనీలు, క్యారియర్లు, ఓఎస్ ప్రొవైడర్లు ముందుకు రావడం శుభ పరిణామం. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 55 క్యారియర్లు, 11 మానుఫాక్చరర్లు, 2 ఓఎస్ ప్రొవైడర్లు (మైక్రోసాఫ్ట్, గూగుల్) ఆర్సీఎస్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చేతులు కలిపాయి. ప్రస్తుతానికి ఆపిల్ కంపెనీకి ఐమెసేజీ ఉంది కాబట్టి, ఆర్సీఎస్ ను సపోర్టు చేసేందుకు అది ముందుకు రాలేదు. కానీ భవిష్యత్తులో ఎంఎస్ఎస్ టెక్నాలజీని ఆర్సీఎస్ పూర్తిగా ఆక్రమించిన తర్వాతనైనా దీనిని సపోర్ట్ చేయడం ఆపిల్ కంపెనీకి అనివార్యం అవుతుంది! వివిధ కంపెనీలకు ఒకే తాటిపైకి తెచ్చి, ఈ బృహత్తర ప్రయత్నాన్ని సాకారం చేసేందుకు గూగుల్ నాయకత్వం వహిస్తోంది. వాస్తవానికి గూగుల్ ఇదివరకే యూనివర్సల్ ప్రొఫైల్ ఆధారంగా చాట్ (Chat) ను రూపొందించింది. ఒకరకంగా ఇదే ఆర్సీఎస్ గా రూపాంతరం చెందనుంది. అయితే, అంతకు ముందుగా ఒక సంవత్సరం లోపు చాట్ బీ(Chat Be) సర్వీసుని అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది.   

 

జన రంజకమైన వార్తలు