దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ .. మల్టిపుల్ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైస్ (మోపాడ్- MOPAD) పేరుతో కొత్త పేమెంట్స్ మెషీన్‌ను తీసుకొచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) యంత్రాలు, యూపీఐ, క్యూఆర్ కోడ్స్ ద్వారా చెల్లింపులకు స్మార్ట్‌ఫోన్లు ఇలాంటివన్నీ అవసరం లేకుండా ఒకే పరికరంతో రకరకాల పేమెంట్స్ ఆప్షన్లు అది కూడా జస్ట్ ఒక్క క్యూఆర్ కోడ్‌తో ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించడమే ఈ మోపాడ్ లక్ష్యం.
మోపాడ్ ఎలా ఉంటుంది?
ఇది కూడా పీఎవోస్ టెర్మినలే. అయితే దీనిలో కార్డ్ స్వైపింగ్‌తోపాటు యూపీఐ, భారత్ క్యూర్, ఎస్‌బీఐ సొంత వాలెట్ అయిన ఎస్‌బీఐ బుడ్డీతో కూడా ట్రాన్సాక్షన్లు చేసుకునేలా తయారుచేశారు. దీనికి కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఎస్‌బీఐ వినియోగదారులకు ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే కార్డ్, క్యాష్ ఏది అక్కర్లేకుండానే కేవలం క్యూఆర్ కోడ్‌తోనే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ మోపాడ్ లాంచింగ్‌లో ప్రకటించారు.
6లక్షల పీవోఎస్‌లు
ఎస్‌బీఐ ఖాతాదారులైన వ్యాపారుల దగ్గర దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షల 23వేలకు పైగా పీవోఎస్‌లున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బిజినెస్ ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి వీరికి ఈ పీవోఎస్‌లు ఉపయోగపడుతున్నాయి. అయితే క్యూఆర్ కోడ్, వాలెట్ పేమెంట్స్ వంటి వాటికి స్మార్ట్‌ఫోన్లు కూడా అవసరమవుతున్నాయి. ఇవన్నీ లేకుండా కస్టమర్లకు, ఎస్‌బీఐ పీవోఎస్‌లు వాడుతున్న వ్యాపారులకు ఇద్దరికీ పనికొచ్చేలా ఈ మోపాడ్‌ను తీసుకొచ్చారు. దశలవారీగా పీవోస్‌లు వాడుతున్న కస్టమర్లందరికీ వీటిని అందించనున్నారు.