ప్రపంచంలో తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టడంపై స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీ ఇప్పటికే ఊపందుకుంది. తదనుగుణంగా కొత్త సంవత్సరం (2019)లో సరికొత్త తరం ‘‘మడిచే ఫోన్లు’’ రాబోతున్నాయ్! శామసంగ్, వా-వే (Huawei), మైక్రోసాఫ్ట్‌లతోపాటు యాపిల్ కూడా వీటిని పరిచయం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాయ్. ఇందులో భాగంగా 2019 తొలినాళ్లకల్లా మార్కెట్‌లో తమ ఫోన్‌ను ప్రవేశపెట్టాలని శామ్‌సంగ్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తాము కూడా 2109కల్లా ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు వా-వే కంపెనీ వినియోగ వస్తువ్యాపార విభాగం CEO రిచర్డ్ యు చెప్పారు. మడిచే ఫోన్‌ను మార్కెట్‌లోకి తేవాలని మైక్రోసాఫ్ట్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రెడ్మండ్‌లోని ఈ సంస్థ ఫోల్డబుల్ సర్ఫేస్ ఫోన్ రూపకల్పనపై ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో 2019 మధ్యలో ఆ మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక యాపిల్‌సహా ఒప్పో, షియోమీ కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్ల తయారీ దిశగా సాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్, వా-వే కంపెనీల మధ్య పోటీ గురించి పరిశీలిద్దాం...
శామ్‌సంగ్ GALAXY X
శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ గురించి ఈ ఏడాది చివరలో వివరించనుంది. దీనికి GALAXY X లేదా GALAXY Fగా నామకరణం చేసే యోచన ఉందని CNBC చానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంస్థ మొబైల్స్ విభాగం CEO డి.జె.కో వెల్లడించారు. ఈ తరహా టెక్నాలజీతో వచ్చే ఫోన్లకు గిరాకీ ఉన్నట్లు శామ్‌సంగ్ నిర్వహించిన వినియోగదారు సర్వేలలో తేలిన నేపథ్యంలో వాటిని మార్కెట్‌లోకి తేవాల్సిన ‘తరుణం ఇదే’నని ఈ సందర్భంగా అన్నారు. మడత పెట్టగల స్క్రీన్ ఎలా పనిచేస్తుందో చెప్పటానికి ఇష్టపడని ఆయన, మడిస్తే అది టాబ్లెట్‌లాగా ఉండదని మాత్రం వెల్లడించారు. ఇది ఇంతకుముందటి ఫ్లిప్ ఫోన్‌లా ఉంటుందని కొందరు భావిస్తున్నా, ఒకే స్క్రీన్‌తో దీన్ని శామ్‌సంగ్ రూపొందిస్తున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. అలాగే దీని ధర 1500 డాలర్లు (రూ.1,08,800కుపైగా) ఉండవచ్చునని కూడా అంచనా వేసింది. ఏదేమైనా, ఈ ఏడాది నవంబరులో శామ్‌సంగ్ నిర్వహించే డెవలపర్ కాన్ఫరెన్స్ వేదికపై దీన్ని గురించి ప్రకటించవచ్చునని డి.జె.కో సూచనప్రాయంగా చెప్పారు.
వా-వే ఫోల్డబుల్ ఫోన్
వచ్చే ఏడాదిలోగా ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తామని వా-వే కంపెనీ సీఈవో రిచర్డ్ యూ- జర్మనీ పత్రిక ‘డీ వెల్తాట్’కు వెల్లడించారు. ‘‘మేమిప్పటికే దీని రూపకల్పనలో మునిగి ఉన్నాం. దీనికోసం మీరు మరో ఏడాది ఎదురుచూడాల్సిన అవసరం లేదు’’ అని కూడా చెప్పారు. అంతేకాకుండా ‘‘మీరెందుకు ఇంకా కంప్యూటర్ వాడుతున్నారు?’’ అంటూ- ఎక్కడికైనా తీసుకెళ్లగల సౌలభ్యం దృష్ట్యా ఇది కంప్యూటర్ల స్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన పేర్కొన్నట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో వంగే లక్షణంగల 8 అంగుళాల OLED ప్యానళ్లతో వా-వే ఫోల్డబుల్ ఫోన్ రానుందని సమాచారం.
‘ఆండ్రోమెడా’తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఫోన్!
మైక్రోసాఫ్ట్ త్వరలో ‘సర్ఫేస్ ఫోన్’ను మార్కెట్లోకి తేనుందని చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఇలాంటి ఫోన్‌ను తేవడంపై కంపెనీ నిర్ధారించనప్పటికీ ఇది 2019 ఆఖరునాటికి రంగ ప్రవేశం చేస్తుందని కథనాలు వస్తున్నాయి. పైగా దీనికోసం ‘‘ANDROMEDA’’ పేరిట సరికొత్త OSను కూడా మైక్రోసాఫ్ట్ రూపొందిస్తున్నదని భోగట్టా. ఇది ‘‘టెలిఫోన్ సామర్థ్యంగల.. జేబులో పెట్టుకోదగిన రెండు తెరల కంప్యూటర్’’లా ఉంటుందని, దీని రంగప్రవేశంతో ఫోన్లకు, టాబ్లెట్లకు తేడా చాలావరకూ చెరిగిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికైతే ఇదంతా ఊహాగానమే.. కొద్దినెలల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్
యాపిల్ ప్రవేశపెట్టదలచిన ఫోల్డబుల్ ఐఫోన్ 2020నాటికి మార్కెట్‌లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన మెరిల్ లించ్ విశ్లేషకుడు వంశీమోహన్ అంచనా వేస్తున్నారు. ఆసియాలో యాపిల్ తరఫు సరఫరాదార్ల నుంచి తనకు ఈ సమాచారం అందినట్లు ఆయన CNBCతో చెప్పారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ మడత విప్పితే టాబ్లెట్‌కన్నా పెద్దదిగా ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, యాపిల్ ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసి ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.